కూటమిలో రెబెల్స్‌..! | - | Sakshi
Sakshi News home page

కూటమిలో రెబెల్స్‌..!

Oct 22 2026 3:38 AM | Updated on Oct 22 2026 3:38 AM

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌: పుర, నగర పంచాయతీ ఎన్నికల ఘట్టం మరోగట్టు దాటింది. నామినేషన్ల పర్వం పూర్తయి.. అభ్యర్థుల ఉప సంహరణ మెట్టు కూడా దాటేసింది. కూటమిలో కొన్ని చోట్ల సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రాలేదు. స్థానిక ఎన్నికల వేళ పార్వతీపురం మున్సిపాలిటీలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయితీ కొత్త మలుపులు తిరుగుతోంది. మొత్తం 36 వార్డులున్న మున్సిపాలిటీలో 11 స్థానాలు కేటాయించాలని జనసేన కోరగా.. నాలుగు స్థానాలకే టీడీపీ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన అభ్యర్థులు స్వతంత్రంగా, రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సాలూరులోనూ చైర్‌ పర్సన్‌ స్థానం జనసేనకు కేటాయించగా.. టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇది కూడా చివరి నిమిషం వరకూ ఉత్కంఠగా మారింది.

ఎవరి దారి వారిదే..

పార్వతీపురంలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకపోవడంతో జనసేన తనదైన దారిలో ముందుకు సాగుతోంది. అరకు పార్లమెంట్‌ ఇన్‌చార్జి, ఎన్నికల సమన్వయకర్త గంగులయ్య చేతుల మీదుగా 14 మంది జనసేన అభ్యర్థులకు బి–ఫారాలు అందజేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. టీడీపీతో సీట్ల ఒప్పందం కుదరకుండానే ఇంతమంది అభ్యర్థులకు బి–ఫారాలు ఇవ్వడం కూటమి రాజకీయాల్లో కలకలం రేపుతోంది. టీడీపీ కూడా 36 వార్డులకు 34 మందికి బి–ఫారాలు అందజేసింది. మరోవైపు జనసేన బి––ఫారాల పంపిణీతో వార్డుల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరికి పార్టీ అధికారికంగా అండగా నిలుస్తుంది? ఎవరికి అవకాశం దక్కుతుంది? కూటమి అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారు? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నెల రోజులుగా కొనసాగుతున్న ఈ గందరగోళానికి తెరపడకపోవడం స్థానిక రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. ఇక బీజేపీ వైఖరి కూడా స్పష్టంగా వెల్లడికాకపోవడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పోటీలో నుంచి వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య సమన్వయం కుదురుతుందా? లేక సీట్ల పంచాయితీతో కూటమి అభ్యర్థుల మధ్యే పోటీ తప్పదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి.. పార్వతీపురం మున్సిపాలిటీలో ప్రత్యర్థి పార్టీలతో పోరుకు ముందే కూటమి పార్టీల మధ్య సీట్ల లెక్కలు తలనొప్పిగా మారాయి. ఈ అంతర్గత విభేదాలు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

పార్వతీపురంలో జనసేనకు

4 సీట్లకే పరిమితం చేయాలని టీడీపీ పట్టు

36 వార్డుల్లో సీట్ల సర్దుబాటుపై పీటముడి

రెబల్స్‌గా బరిలోకి జనసేన అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement