మున్సిపల్ బరిలో..
సాక్షి, పార్వతీపురం మన్యం: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా బుధవారంతో పూర్తయింది. ఇక ఎన్నికల ప్రచారానికి తెరలేవాల్సిన తరుణంలో అభ్యర్థులపై ఒత్తిళ్లు, బెదిరింపులు తెరపైకి వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బరిలో నిలిచిన ప్రతిపక్ష, స్వతంత్ర అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలుత తెలిసినవారు, మధ్యవర్తుల ద్వారా రాయబేరాలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటికి అభ్యర్థులు అంగీకరించకపోతే నేరుగా ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ‘పోటీ ఎలా చేస్తావో చూస్తాం.. ప్రచారం ఎలా నిర్వహిస్తావో చూస్తాం.. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే నీ అంతు చూస్తాం’ అంటూ భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, స్వతంత్ర అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని నయానో, భయానో పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. కేవలం కౌన్సిలర్ అభ్యర్థులను కాక.. మున్సిపల్ చైర్ పర్సన్‌గా పోటీలో నిలిచిన వారికి సైతం ఈ బెదిరింపులు తప్పలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్, చైర్ పర్సన్ అభ్యర్థుల నుంచే ఈ తరహా వార్నింగ్‌లు వస్తున్నాయని పలువురు ప్రతిపక్ష, స్వతంత్ర అభ్యర్థులు వాపోయారు. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే పరిస్థితి ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు పార్వతీపురం పురపాలక సంఘానికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర చేరుకున్నారు. అక్కడే కమిషనర్ ఛాంబర్ ఎదురుగా గదిలో కూర్చుని.. తమ అభ్యర్థులు ఒక్కొక్కరికీ బి–ఫారాలు అందజేశారు. 3 గంటల తర్వాత గేట్లు వేసేయడంతో కొంతమంది ఉప సంహరణకు వచ్చి, ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే వెళ్లిపోయారు. ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి అభ్యర్థికీ రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాల్సింది ప్రజల ముందే తప్ప, బెదిరింపులతో కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం స్పందించి, అభ్యర్థులకు భద్రత కల్పించడంతో పాటు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కుదిరితే రాయ‘బేరం’..
లేకుంటే దండోపాయం!
పోటీలో ఉంటే.. నీ అంతు చూస్తా!
ప్రత్యర్థి అభ్యర్థులకు ఫోన్లు.. పోటీ నుంచి తప్పుకోవాలంటూ ఒత్తిళ్లు?
అధికార పార్టీ నేతల తీరుపై
అభ్యర్థుల్లో ఆందోళన


