గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామ స్వామి ఆలయాల హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కిస్తామని ఈఓ వి.వి.సూర్యనారాయణ తెలిపారు. భక్తుల నుంచి వచ్చిన కానుకలు, విరాళాలను దేవదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో లెక్కిస్తామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ సాలూరు పట్టణాధ్యక్షుడిగా ద్వారపురెడ్డి పుండరీకాక్ష
సాలూరు: వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడిగా ద్వారపురెడ్డి పుండరీకాక్ష నాయుడును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. ఆయనకు మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర అభినందనలు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపధ్యంలో వి.అప్పలనాయుడును ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
పురపోరుకు సై
● బరిలో మిగిలింది వీరే..
● ముగిసిన నామినేషన్లు,
ఉపసంహరణ ప్రక్రియ
సాక్షి, పార్వతీపురం మన్యం: పుర ఎన్నికల ప్రక్రియ చివరి దశకు వచ్చింది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ప్రధాన వైఎస్సార్‌సీపీ, టీడీపీల నుంచి దాదాపు అన్ని వార్డుల్లోనూ పోటీలో ఉండగా.. పలుచోట్ల బీజేపీ, జనసేన, వామపక్షాలు కూడా సై అంటున్నాయి. ఈ నెల 28న జరిగే ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
● పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌కు సంబంధించి ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయగా.. ఎస్.లక్ష్మీపార్వతి(వైఎస్సార్‌సీపీ), ద్వారపురెడ్డి జ్యోతి(బీజేపీ), ద్వారపురెడ్డి దీప్తి(జనసేన) ఉపసంహరించుకున్నారు. వీరు కాక.. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన, ఇండిపెండెంట్ ఒక్కొక్కరు చొప్పున బరిలో మిగిలారు. పార్వతీపురంలోని 36 వార్డుల్లో కౌన్సిల్ సభ్యులకు సంబంధించి 196 నామినేషన్లు రాగా.. 185 అర్హతగా గుర్తించారు. ఇందులో 64 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వివిధ పార్టీల నుంచి 122 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో 34 మంది స్వతంత్రులు ఉన్నారు.
● సాలూరులో మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానానికి ఆరుగురు పోటీ పడుతున్నారు. ఇందులో ముగ్గురు ఇండిపెండెంట్లు కాగా.. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, జనసేన నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వార్డు సభ్యులకు సంబంధించి 32 వార్డు స్థానాలకు 200 నామినేషన్లు రాగా.. 85 మంది బరిలో ఉన్నారు.


