● జెడ్పీటీసీ స్థానాలకు ఐదు నామినేషన్లు
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో పల్లెపోరు మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. 15 మండలాల్లో 226 ఎంపీటీసీలకు సంబంధించి మండల కార్యాలయాలు, 15 జెడ్పీటీసీలకు జిల్లా పరిషత్ వద్ద నామినేషన్ స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. ఆయా కేంద్రాల వద్ద పోలీస్ యంత్రాంగం రెండంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపడతారు. 24న నామినేషన్లను పరిశీలిస్తారు. నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. అదేనెల ఐదో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. తొలిరోజు జెడ్పీటీసీ స్థానాలకు ఐదు నామినేషన్లు పడ్డాయి. ఇందులో వైఎస్సార్సీపీ 2, టీడీపీ 2, బీజేపీ ఒకటి చొప్పున ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 226కి 109 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైస్సార్సీపీ తరఫున 52, టీడీపీ నుంచి 40, జనసేన–07, సీపీఎం–07, బీజేపీ ఒకటి చొప్పున ఉన్నాయి.


