● పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు
● హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీ
విజయనగరం టౌన్:
పోలీసు అమరవీరుల దినాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణం స్మృతివనంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అమరవీరులకు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎం.బబిత, కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు అమరవీరుల స్మతి స్ధూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన 154 మంది పోలీసుల వివరాలతో కూడిన పుస్తకాన్ని ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆవిష్కరించారు. ఏఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్ ఆ పుస్తకంలో ఉన్న తీవ్రవాదుల దాడుల్లో మృతిచెందిన 154 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను చదివి వినిపించారు.
పోలీసుల త్యాగాల ఫలితంగా ప్రశాంత జీవనం
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎం.బబిత మాట్లాడుతూ విధి నిర్వహణలో చాలామంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారని, వారు చేసిన త్యాగాల ఫలితంగా నేడు మనమంతా ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు న్యాయవ్యవస్ధ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశభద్రతకు రెవెన్యూ, పోలీస్, జ్యుడిషియల్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా జీవించాలనే ఉద్దేశంతో కంటికి కనిపించని శత్రువులతో పోరాటాలు చేసి, అనేక మంది పోలీసులు విధులను నిర్వహిస్తూ, ప్రాణాలను కోల్పోయారన్నారు. అటువంటి పోలీసు కుటుంబాలకు మనమంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.
అమరవీరుల కుటుంబాల యోగక్షేమాలపై ఆరా
ఎస్పీ ఏఆర్.దామోదర్ మాట్లాడుతూ దేశంలో మావోయిజం తీవ్రంగా ఉన్న సమయంలో దేశ అంతర్గత భద్రత కోసం, మావోయిస్టుల తీవ్రవాద కార్యక్రమాలను అరికట్టేందుకు వారితో పోరాటం చేసి, ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని కొనియాడారు. అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబాలతో మమేకమై, వారియోగక్షేమాలు అడిగి తెలుసుకుని, వారికి పండ్లు, నగదు అందజేసి అన్నివిధాలుగా అండగా ఉంటామన్న భరోసా కల్పించారు. కార్యక్రమలో ఎన్‌సీసీ వింగ్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ రవివ్యాస్, సైనిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ ఎస్.కిరణ్, విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి, పోలీస్ అమరవీరులు సీహెచ్.చిరంజీవిరావు, షేక్ ఇస్మాయిల్ కుటుంబసభ్యులు షేక్ వీటి జాన్, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.
ఆయుధపూజలో పాల్గొన్న ఎస్పీ
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ ఏఆర్.దామోదర్ దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా, దుష్టశిక్షణ, శిష్టరక్షణకు పోలీసుశాఖ వినియోగిస్తున్న వివిధ ఆయుధాలు, వాహనాలు, బాంబ్ డిస్పోజల్ పరికరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. పోలీసు ఉద్యోగులు సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని, తలపెట్టిన పనుల్లో విజయం సాధించాలని, ప్రజలందరికీ మంచి జరగాలని శ్రీ దుర్గాదేవిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం అభివృద్ధి చేసిన బాంబ్ డిస్పోజల్ కార్యాలయాన్ని ప్రారంభించి, వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. దసరా వేడుకల్లో ఏఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్, ఆర్‌ఐలు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్‌కుమార్, పి.శ్రీనివాసరావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


