● బుర్రకథ చూసివస్తూ మృత్యుఒడిలోకి ఇద్దరు విద్యార్థులు
మక్కువ: తమ పిల్లలు బాగా చదువుకుని తమ ఆశలు నెరవేరుస్తారని భావించిన ఓ రెండు కుటుంబాల వారి ఆశలు రోడ్డు ప్రమాదం రూపంలో ఆవిరయ్యాయి. తమ పిల్లలు బాగా చదివి ప్రయోజకులవుతారని ఆశించిన కుటుంబసభ్యులు తమ పిల్లలను విగతజీవుల్లా చూసి కంటికీమింటికీ ఏకధారగా రోదిస్తున్నారు. స్నేహితులైన ఇద్దరు విద్యార్థులు బైక్ ప్రమాదంలో మృతిచెంది కుటుంబసభ్యులకు కడుపుకోత మిగిల్చారు. ఈ విషాద సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చప్పబుచ్చమ్మపేట గ్రామానికి చెందిన వైకుంఠపు గిరి(17) శివకోటి రవి(17) స్నేహితులు. ఒకరు మక్కువలో ఇంటర్మీడియట్, మరొకరు విశాఖపట్నంలో పాలిటెక్నిక్ చదువుతున్నారు. వారిద్దరూ దసరా పండగ నిమిత్తం గ్రామానికి చేరుకుని, మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబసభ్యులు, పండగకు గ్రామానికి వచ్చిన ఇతర స్నేహితులతో ఆనందంగా గడిపారు. దసరా పండగ సందర్భంగా సమీప గ్రామంలో బుర్రకథ ప్రోగ్రాం వేస్తున్నారని తెలుసుకుని ఇద్దరు స్నేహితులు కలిసి మంగళవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్లారు. ప్రోగ్రాం చూసుకుని తిరిగి గ్రామానికి బయల్దేరి కొంతదూరం ప్రయాణించగా, వేగంగా ప్రయాణించారో? ఏదైనా అడ్డువచ్చిందా? ఏమైందో ఏమో కానీ విద్యుత్‌స్తంభాన్ని బలంగా బైక్‌తో ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడు పార్వతీపురం అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుతిద్దరిదీ ఒకే గ్రామం కావడంతో, పండగపూట గ్రామం శోకసంద్రంలోమునిగిపోయింది. ప్రమాద సమాచారం మేరకు ఏఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేశారు. మృతుడు గిరికి తండ్రి నరసింహ నాయుడు, తల్లి చిన్నారి, సోదరుడు ఉన్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటారు. మృతుడు రవి తండ్రి కోటేశ్వర రావు గతేడాది అనారోగ్యంతో చనిపోగా తల్లి సుబ్బలక్ష్మి మక్కువలో ఓ హోటల్‌లో పనిచేస్తోంది. సోదరుడు ఉన్నాడు.


