ఓటరు దేవుడికి తాయిలాల నైవేద్యం | - | Sakshi
Sakshi News home page

ఓటరు దేవుడికి తాయిలాల నైవేద్యం

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

సాక్షి, పార్వతీపురం మన్యం:

స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. పట్టణం నుంచి పల్లె వరకు రాజకీయ వేడి పెరుగుతోంది. నిన్నటివరకు పలకరించడానికి కూడా తీరిక లేదన్న నేతలు.. ఇప్పుడు ప్రతి ఇంటి గడప తొక్కుతున్నారు. ఓటరు కనిపిస్తే చాలు.. ఆప్యాయతలు పొంగిపొర్లుతున్నాయి. వరసలు కలుపుతూ బంధుత్వాలు గుర్తు చేస్తున్నారు. ‘బావా.. బాగున్నావా?’, ‘వదినా.. ఎలా ఉన్నావు?’, ‘అన్నయ్యా.. మీ కుటుంబమే మా కుటుంబం’ అంటూ కొత్త బంధాలకు తెర తీస్తున్నారు. ఎన్నికలు వస్తేనే గుర్తుకొచ్చే ఈ బంధుత్వాలకు కాలపరిమితి మాత్రం పోలింగ్‌ రోజుతోనే ముగుస్తుందన్నది ప్రజల్లో వినిపిస్తున్న వ్యంగ్యం!

● బంధుత్వాలకూ ఎన్నికల సీజనే..

ఎన్నికల వేళ రాజకీయ నాయకులకు బంధువుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఎప్పుడూ పలకరించని వారు సైతం ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఓటరు ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చుంటున్నారు. కష్టసుఖాలు అడుగుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ‘మీ ఓటు మా కుటుంబానికే వేయాలి’ అంటూ కుటుంబ సంబంధాలకూ రాజకీయ రంగు పులుముతున్నారు. ఓటరు కూడా పాతికేళ్ల రాజకీయ అనుభవం ఉన్నంత తెలివితోనే వ్యవహరిస్తున్నాడు. ఎవరు ఎప్పుడు వస్తారో.. ఎవరు ఏం ఇస్తారో గమనిస్తున్నాడు. ఎవరి మాటల్లో ఎంత మమకారం ఉందో, మరెంత ఓట్ల లెక్క దాగి ఉందో బేరీజు వేస్తున్నాడు. పండగ పూట అందిన మాంసం పొట్లం ఒక్కరోజుకే సరిపోవచ్చు. కొత్త చీర కొన్ని సందర్భాల్లోనే ఉపయోగపడవచ్చు... తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి సమస్యలు మాత్రం రోజూ వెంటాడుతూనే ఉంటాయి. అందుకే ఎన్నికల వేళ అందుతున్న కానుకల కంటే.. ఎన్నికల తర్వాత ప్రజల కోసం ఎవరు నిలబడతారన్నదే అసలు ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను కానుకలతో కొలవలేరు. పండగ పేరుతోనో, బంధుత్వాల పేరుతోనో ఓటరును ప్రభావితం చేయాలనే ప్రయత్నాలు ఎంత జరిగినా.. చివరకు ఓటు హక్కు మాత్రం ఓటరు చేతిలోనే ఉంటుంది. పండగ సంబరాల మధ్య సాగుతున్న ఈ తాయిలాల రాజకీయంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది పక్కన పెడితే.. అభ్యర్థులు మాత్రం ఇప్పుడే ఓటర్లకు ఆప్తులైపోతున్నారు!

కలిసొచ్చిన దసరా పండగ

ఈసారి దసరా పండగ కూడా అభ్యర్థులకు కలిసొచ్చింది. పండగ సంబరాలను ఓట్ల వేటకు అనుసంధానిస్తూ కొందరు అభ్యర్థులు తాయిలాల పంపిణీకి తెర తీశారు. ఓవైపు ప్రచార హోరు.. మరోవైపు మాంసం పొట్లాల పంపిణీ.. ఇంకోవైపు చీరల పంపకాలు.. వెరసి ఎన్నికల రాజకీయం పండగ పూట కొత్త రూపు సంతరించుకుంటోంది. దసరా పండగ వచ్చిందంటే చాలా కుటుంబాల్లో మాంసాహార వంటకాలు ప్రత్యేకం. ఈ అలవాటునే కొందరు అభ్యర్థులు తమ ప్రచారానికి అనుకూలంగా మలుచుకుంటున్నారనే చర్చ సాగుతోంది. కోడి, గొర్రె పోతు మాంసాన్ని అరకిలో, కిలో చొప్పున ఇళ్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఒక అభ్యర్థి ఇచ్చిన పొట్లం అందుకున్న ఇంటికి.. మరో అభ్యర్థి కూడా తన వంతు పంపిస్తుండడంతో కొన్ని ఇళ్లలో రెండు, మూడు కిలోల వరకు మాంసం సమకూరుతోందని స్థానికంగా చెప్పుకుంటున్నారు. దీంతో ఓటరు ఇంట్లో పొయ్యి వెలగకముందే రాజకీయ వేడి రాజుకుంటోంది. అభ్యర్థులు మాత్రం ప్రజలపై ప్రేమతోనే ఇదంతా చేస్తున్నామని చెప్పుకోవచ్చు గాక.. ఓటర్ల మనసులో మాత్రం ఒకటే ప్రశ్న.. ‘ఈ పండగ మమకారం ఎన్నికల తర్వాత కూడా ఉంటుందా?’ అని!

చీరలతో ఓట్లకు వల!

మాంసం పొట్లాలతో సరిపెట్టని మరికొందరు అభ్యర్థులు మహిళలను ఆకర్షించేందుకు చీరల పంపిణీకి తెర తీస్తున్నారనే ప్రచారం ఉంది. పండగకు కొత్త చీర.. ఎన్నికల వేళ కొత్త బంధం.. అభ్యర్థుల లెక్కలు మాత్రం పక్కాగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకోవాల్సిన నాయకులు.. ముందుగా ఇంటింటికీ కానుకలు చేరేలా చూస్తున్నారన్న వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చీర అందుకున్న ప్రతి మహిళ ఓటు తమకే వేస్తుందని, మాంసం పొట్లం అందుకున్న ప్రతి కుటుంబం తమ వెంటే ఉంటుందని అభ్యర్థులు భావిస్తే అది రాజకీయాల్లో మరో రకమైన అపోహే అవుతుంది. కానుక తీసుకున్న చేతే ఓటు వేస్తుందని గ్యారంటీ ఇచ్చే యంత్రం ఇంకా ఎన్నికల మార్కెట్‌లోకి రాలేదు కదా!

ఓటరుకు దసరా.. అభ్యర్థులకు ప్రచార పండగ

పట్టణం నుంచి పల్లె వరకు బంధుత్వ

రాజకీయం..

మాటల్లో మమకారం ఒలకబోస్తూ..

ఇళ్లకు మాంసం పొట్లాలు, మహిళలకు చీరల పంపిణీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement