పాలకొండ: పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ కూటమి అభ్యర్థి ఎంపిక పంచాయితీ అర్థరాత్రి వరకు సాగింది. మూడు పార్టీలు తమకు అంటే తమకు కావాలని పట్టుబట్టాయి. టీడీపీ నాయకుడు పల్లా కొండలరావు తన భార్య పల్లా విజయనిర్మలకు సీటు కావాలని, మరో నాయకుడు గంటా సంతోష్ మొదటి నుంచి తనకు ఇక్కడి స్థానం కేటాయిస్తారని ఆశిస్తున్నారు. ప్రస్తుతం వీరు టీడీపీలో ఉన్నప్పటికీ జనసేన కండువా వేసుకుంటా మని, సీటు కేటాయించాలని కోరుతున్నారు. వీరితో పాటు జనసేన నుంచి కొంచాడ అరుణకుమార్ తన భార్యకు ఇక్కడ స్థానం కోసం ప్రయత్నించడంతో పార్టీ నాయకులు మల్లగుళ్లాలు పడ్డారు. వైఎస్సార్ సీపీ తరఫున బలమైన సామాజిక వర్గం నుంచి అభ్యర్థి ఉండడంతో ఆదే సామాజిక వర్గానికి సీటు కేటాయించాలని మరి కొంతమంది పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో పాలకొండ పట్టణంలో ఎమ్మెల్సీ నాగబాబు పార్టీ కేడర్‌తో శనివారం సమా వేశ మయ్యారు. అభ్యర్థిని ప్రకటించకుండానే వెళ్లి పోయారు. చివరకు పల్లా విజయ నిర్మలకు టికెట్ కేటాయించినట్టు ప్రకటించారు. సీటు కోసం ఆమె జనసేనలో చేరనుంది.
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పురపాలిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా సంగంరెడ్డి లక్ష్మీ పార్వతిని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఆమె తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. కూటమి తరఫున టీడీపీ నుంచి బెలగాం కరుణను ఆ పార్టీ బరిలో దించుతోంది. పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా కూటమిలోనే బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు కూడా తన సతీమణితో నామినేషన్ దాఖలు చేయించారు. ఈ స్థానం అన్ రిజర్వుడు(మహిళ)కు కేటాయించిన విషయం విదితమే.
అప్పయ్యపేట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు
సీతానగరం: మండలంలోని బక్కుపేటలో సంచరించే ఏనుగుల గుంపు శనివారం అప్పయ్యపేట కొండ పక్కనే ఉన్న పంట పొలాల్లోకి చేరింది. ఏనుగుల సంరక్షణ కేంద్రానికి సమీపంలో రైతులు సాగుచేస్తున్న నీలగిరి, ఫామాయిల్ మొక్కతోటలను నాశనం చేస్తుండడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఏనుగుల గుంపును తరలించి పంటలను కాపాడాలని కోరుతున్నారు.
జనసేనను బతికించండి
● పార్టీ విజయనగరం పార్లమెంటరీ కమిటీ కో ఆర్డినేటర్ గురాన అయ్యలు
విజయనగరం రూరల్: జిల్లాలో కూటమి పార్టీలు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు.. జనసేన వాటా సీట్లు జన సేననాయకులకు ఇవ్వడం లేదు.. అందుకే విజయనగరం మేయర్ అభ్యర్థిగా తన భార్య రాధికతో నామినేషన్ దాఖలు చేయించాను.. జనసేన నాయకులు, కార్యకర్తలకు జరగుతున్న అన్యాయంపై స్పందించండి.. పార్టీని బతికించండి అంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను పార్టీ విజయనగరం పార్లమెంటరీ కమిటీ కో ఆర్డినేటర్ గురాన అయ్యలు మీడియా సాక్షిగా శనివారం విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా విజయనగరం కార్పొరేషన్లో జనసేన పార్టీకి సీట్ల కేటాయింపులో అన్యాయం జరిందన్నారు. జనసేన అధినేత మాటను విస్మరించకుండా, ఆయన మాటకు కట్టుబడి పనిచేస్తున్నామని, జిల్లాలో టీడీపీ నేతలు పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారన్నారు. పార్టీ శ్రేణుల ఆవేదనను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గుర్తించాలని కోరారు. విజయనగరం 30వ వార్డులో గతంలో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన కార్పొరేటర్‌ను ఇప్పుడు టీడీపీ చేర్పించుకుని జనసేనకు టికెట్లేకుండా చేస్తున్నారన్నారు. 62 వార్డుల్లో జనసేనకు 20 సీట్లు కేటాయించాలని కోరితే కేవలం ముష్టివేసినట్టు ఐదు సీట్లు కేటాయిస్తామని కుండబద్ధలు కొట్టారన్నారు. బలం లేనిచోట టికెట్లు తీసుకోవాలని చెబుతున్నారన్నారు. జనసేన శ్రేణుల సూచనల మేరకే మేయర్ అభ్యర్థిగా తన భార్యను రంగంలోకి దించినట్టు స్పష్టంచేశారు.


