విజయనగరం ఫోర్ట్: విజయనగరం పట్టణానికి చెందిన లక్ష్మి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు థైరాయిడ్ పరీక్ష చేసుకోమని చీటి రాసి ఆమెకు ఇచ్చారు. దీంతో ఆమె చీటీ పట్టుకుని ల్యాబ్వద్దకు వెళ్లగా..థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని చెప్పడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ప్రైవేట్ ల్యాబ్లో రూ. 600 పెట్టి పరీక్ష చేయించుకుంది.
● గంట్యాడ మండలానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ థైరాయిడ్ లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఆమెను పరీక్షించి థైరాయిడ్ పరీక్షలు చేయించుకోమని చీటీ రాసి ఇచ్చారు. ఆమెకు కూడా ఆస్పత్రి సిబ్బంది థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని చెప్పడంతో, ప్రైవేట్ ల్యాబ్లో పరీక్ష చేయించుకుంది. ఈ పరిస్థితి వీళ్లద్దరిదీ కాదు.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వస్తున్న అనేక మంది రోగులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు కనీసం వైద్య పరీక్షలు కూడా అందించలేని దుస్థితిలో టీడీపీ సర్కార్ ఉందని రోగులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే ఆర్థిక సోమత లేక ప్రభుత్వాస్పత్రికి వస్తే ఇక్కడా పూర్తి స్థాయిలో వైద్యం అందే పరిస్థితి లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి ఇదే పరిస్థితి ఉన్నా అటు ప్రజా ప్రతినిధులు గాని ఇటు అధికారులకు గాని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భారం తగ్గించుకోవడం కోసమే..
భారం తగ్గించుకోవడం కోసమే థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు టీడీపీ సర్కార్ నిలిపివేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోజుకి 30 నుంచి 40 మంది వరకు థైరాయిడ్ నిర్ధారణ పరీక్షల కోసం వస్తారు. అయితే 8 నెలలుగా థైరాయిడ్ పరీక్షలు నిలిచిపోయాయి. నెలకు 1000 చొప్పన 8 నెలలకు 8 వేల వరకు థైరాయిడ్ పరీక్షలు చేయాల్సి ఉంది. వీటికి సుమారు రూ. 40 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ భారాన్ని తగ్గించుకోవడమే కోసమే సర్కారు చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వదులుతున్న చేతిచమురు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలు అందకపోవడంతో రోగులకు చేతి చమురు వదులుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయకపోవడంతో రోగులు ప్రైవేట్ లేబరేటరీల్లో సొంత డబ్బులు పెట్టి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిలిచిన
థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు
ఎనిమిది నెలలవుతున్నా పట్టించికోని వైనం
రోగులకు తప్పని ఇబ్బందులు
మిషన్ పనిచేయడం లేదు..
థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయిన మాట వాస్తవమే. పరీక్ష చేసే మిషన్ పనిచేయడం లేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటిండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి


