బీసీల రిజర్వేషన్లపై చంద్రబాబు నాటకం బట్టబయలు
సాధ్యం కాదని తెలిసీ ఎన్నికల డ్రామాలు
హైకోర్టు తీర్పుతో.. మళ్లీ సుప్రీంకోర్టు
అంటూ ఎన్నికల వేళ కొత్త పల్లవి
బీసీలపై ముఖ్యమంత్రి చూపించిన కపట ప్రేమ బట్టబయలయింది. స్థానిక ఎన్నికలను డిసైడ్ చేసేది బీసీలే అని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలపై అపారమైన ప్రేమ కురిపిస్తూ, రిజర్వేష న్లు 34 శాతానికి పెంచినట్లు 105, 1065 జీవోలు విడుదల చేశారు. రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకా రం 50 శాతానికి మించకూడదని, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం హాస్యాస్పదం. మా నాయకుడు రాహుల్ గాంధీ కోరినట్లు కులగణన చేసి, రేషియోను బట్టి దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు పెంచి చట్టం చేసి చూపించాలి.
వి.దాలియుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా
అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం
సాక్షి పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్/పాలకొండ రూరల్/మక్కువ: హైకోర్టు తీర్పుతో బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ వ్యవహారం మరోసారి బట్టబయలయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన రెండు జీవోలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో 59 శాతం రిజర్వేషన్లను మించి ఇవ్వరాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు స్పష్టంగా ఉన్నా సరే.. చంద్రబాబు బీసీలను వంచించేందుకే 34 శాతం రిజర్వేషన్ల డ్రామా ఆడారన్న విమర్శలు ఆయా వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బీసీ వర్గాలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సముచిత స్థానం కల్పించారు. ప్రధానంగా జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో మూడు ఎస్టీ, ఒక ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు ఇచ్చిన హామీ మేర సముచిత స్థానం కల్పించారు. అందునా మహిళలకు పెద్దపీట వేశారు. పార్వతీపురం మన్యం జిల్లా జనాభా సుమారు 9.25 లక్షలు కాగా... ఇందులో బీసీ (వెనుకబడిన తరగతులు) జనాభా సుమారు 55.5 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి సారీ స్థానిక సంస్థల విజేతలను నిర్ణయించేది వీరి ఓటు బ్యాంకే. ఓట్ల కోసమే, వీరందరినీ వంచించేలా.. చంద్రబాబు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పేరిట చిత్తశుద్ధి లేని డ్రామాలాడి.. తన కపట ప్రేమను మరోసారి బయట పెట్టుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆయా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.


