పార్వతీపురం: పార్వతీపురం పురపాలక సంఘం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన బి. రాంగోపాల్ గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం మున్సిపాల్టీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ప్రజ లకు అందుతున్న మున్సిపల్ సేవలు తదితర అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు. పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు చేపడతామని కమిషనర్ ఈ సందర్భంగా కలెక్టర్‌కు తెలిపారు.
పార్వతీపురం: అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులను సకాలంలో, ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆమె తన చాంబర్‌లో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని, రేషన్ షాపులు, గోదాములను తరచూ తనిఖీ చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో సివిల్ సప్లైస్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్:
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఈ నెల 5వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి ఈ శిబిరం ప్రారంభమవుతుందని జిల్లా సమన్వయాధికారి డా.జి.నాగభూషణరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వై.నాగ శివజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో సాధారణ వైద్యంతో పాటు స్పెషాలిటీ, సూప ర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందిస్తారు. విశాఖపట్నంలోని ఒమెగా ఆస్పత్రి వైద్యులు నోటి, రొమ్ము, గర్భాశయ కేన్సర్లకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ నిపుణులతో పాటు ఆయుర్వేద, హోమియోపతి వైద్యులు కూడా అందుబాటులో ఉండి సేవలు అందిస్తారు. బీపీ, మధుమేహం, టీబీ, రక్తహీనత, సికిల్ సెల్ అనీమియా బాధితులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తారు.
గర్భిణులకు తనిఖీలు, చిన్నారులకు టీకాల పంపిణీతో పాటు అత్యవసర రోగుల కోసం రక్తదాన శిబిరాన్ని సైతం ఏర్పాటు చేశారు. పార్వతీపురం, పరిసర మండలాల ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని వారు సూచించారు.


