నిషేధిత జాబితాలో భూములు
రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు కావడం లేదని రైతుల ఆవేదన
పింఛన్లు దూరమై.. ఒంటరి మహిళల జీవనం భారమై..
బురద నీరే దిక్కు
పీజీఆర్‌ఎస్‌లో వేడుకోలు
ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ఆర్జీదారులు పోటెత్తుతున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య.. ఒక్కో వేదన.. ఎన్నోమార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. ఈ సోమవారం కూడా కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో అధికారులను కలిసి తమ గోడును వినిపించారు.
భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న రైతులు
ఈ చిత్రంలోని మహిళ పేరు కాకర్ల గౌరమ్మ. పార్వతీపురం మండలం ములగ పంచాయతీ నడిమ ముల గ గ్రామం. ఈమె భర్త సుమారు 18 ఏళ్ల క్రితం విడిచి వెళ్లిపోయాడు. తర్వాత ఆమెకు ఒంటరి మహిళ పింఛన్ వచ్చేది. కొంతకాలం క్రితం రేషన్ కార్డులో భర్త పేరు ఉందన్న కారణంతో ఆ పింఛన్‌ను రద్దు చేశారు. అప్పటి నుంచి తన జీవనం కష్టంగా మారిందని.. పింఛన్‌ను పునరుద్ధరించి, బతుకుకు ఒక మార్గం చూపాలని ఆమె వేడుకుంటోంది.
●పార్వతీపురంలోని గోచెక్క గ్రామానికి చెంది న నల్ల ప్రభావతిని సుమారు 25 ఏళ్ల క్రితం భర్త విడిచిపెట్టి, వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పెంచి పెళ్లిళ్లు చేసింది. ప్రస్తుతం ఒంటరిగా జీవి స్తున్న ఆమెకు ఏ ఆధారమూ లేదు. రేషన్‌కార్డు భర్త తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో పింఛన్ కూడా రావడం లేదు. తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభావతి కోరుతోంది.
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ :
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల వేదికలో అర్జీలు సమర్పిస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని, పదే పదే తిరగాల్సి వస్తోందని అర్జీదారులు వాపోతున్నారు. ఈ వారం కూడా పలువురు అర్జీదారులు తమ సమస్యలపై వినతిపత్రాలు తీసుకుని కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
బలిజిపేట మండలం పెద్దింపేట గ్రామానికి చెందిన రైతులు తమ భూములకు సంబంధించి 22ఎ సమస్యను పరిష్కరించి..హక్కులు, రెవెన్యూ రికా ర్డుల విషయంలో న్యాయం చేయాలని కోరారు. గ్రామంలోని సుమారు 457.85 ఎకరాల భూములు ఈ సమస్య పరిధిలో ఉన్నాయని కలెక్టర్‌ను కలిసి వివరించారు. మూడు తరాలుగా ఈ భూములలోనే సాగు చేస్తున్నామని.. వాటికి సంబంధించిన పాత రెవెన్యూ రికార్డులు, వన్‌బీ, అడంగల్ వంటివి ఉన్నాయని చెప్పారు. 22ఎలో పడిపోవడం వల్ల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు జరగడం లేదని వాపోయారు.
పార్వతీపురం మున్సిపాలిటీలో తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని నాలుగో వార్డు పరిధి వివేకానంద కాలనీ, మెహర్‌బాబావీధి తదితర ప్రాంతాల మహిళలు వాపోయారు. వారం, పది రోజులకోసారి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని.. అది కూడా బురదగా ఉంటోందని చెప్పారు. ఒండ్రు మట్టితో కలుషితమైన నీటిని తాగడం వల్ల పచ్చకామెర్లు,, మలేరియా, టైఫాయి డ్ వంటి రోగాల బారిన పడుతున్నామన్నారు. పన్నుల కోసం ఒత్తిడి చేసే అధికారులు..సక్రమంగా మంచినీరు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు.


