కట్‌కటలే! | - | Sakshi
Sakshi News home page

కట్‌కటలే!

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

కట్‌కటలే!

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

నీరూ రాదు.. కరెంట్‌ ఉండదు

ఎల్‌నినో కాదు.. ప్రభుత్వ ముందస్తు చర్యలు లేకపోవడమే కారణం

వేసవిని మించి ఇబ్బందులు

బురదనీరు సరఫరాపై కమిషనర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళలు, స్థానికులు

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల వేసవిని మించి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉక్కబోత, వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు తాగునీరు సరిగా సరఫరా కావడంలేదు. విద్యుత్‌ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు తీసివేస్తారో తెలియని పరిస్థితి. గుక్కెడు తాగునీటి కోసం పల్లె, పట్టణ ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకునేవారే లేరు. తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ప్రభుత్వ ముందస్తు చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకు ఎల్‌నినో కారణమని నేతలు చెబుతుండడంపై జనం మండిపడుతున్నారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితి మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కనిపిస్తుందని, సెప్టెంబర్‌ చివరికి వచ్చినా.. తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో కోతలు పెడుతున్నారంటే ప్రభుత్వ అసమర్థతే కారణమని ప్రజలు అంటున్నారు.

నీటి కోసం రోడ్డెక్కుతున్న ప్రజలు

జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్ల నుంచి తాగునీరు రావడం లేదు. కనిష్ట స్థాయికి జలమట్టం పడిపోతోంది. జిల్లా కేంద్రం పార్వతీపురంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కుళాయిల ద్వారా కొద్దిరోజులుగా బురదనీరే సరఫరా అవుతోంది. ఈ నీరు తాగేందుకు కాదు కదా, వాడుకకు కూడా వినియోగించలేకపోతున్నామని మహిళలు వాపోతున్నారు. శనివారం బురదనీటిని సీసాలతో తీసుకొచ్చి, మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.

● 30 వార్డులున్న పార్వతీపురంలో 62 వేల మంది జనాభా నివసిస్తున్నారు. మొత్తం గృహ వినియోగ కుళాయి కనెక్షన్లు 7,050 ఉండగా.. వీటికి సరిపడేలా రోజుకు 8.5 ఎంఎల్‌డీ తాగునీరు అవసరం. ప్రస్తుతం మూడురోజులకోసారి 2.9 ఎంఎల్‌డీ మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. మూడో వంతు మాత్రమే నీటిని అందించగలుగుతున్నారు. అది కూడా బురదనీరే కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

● 28 వార్డులున్న పాలకొండ నగర పంచాయతీలో 38 వేల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ రోజుకు నాలుగు ఎంఎల్‌డీ తాగునీరు అవసరం కాగా.. ప్రస్తుతం 2.4 ఎంఎల్‌డీ మాత్రమే అందిస్తున్నారు. దీనివల్ల అనేక ప్రాంతాలు నీటి సమస్య ఎదుర్కొంటున్నాయి. సాలూరు మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తేనే ప్రజలకు శుద్ధ జలం అందేది. చెరువులు, నదులు ఎండిపోవడంతో గ్రామాల్లో సైతం ప్రజలు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

ఓవైపు ఉక్కబోత.. మరోవైపు కరెంటు కోత

వేసవిని తలపించే ఎండలు ఉంటాయని ముందుగానే ప్రభుత్వానికి హెచ్చరికలు ఉన్నా.. ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్ల ఈఎల్‌ఆర్‌ (ఎమెర్జన్సీ లోడ్‌ రిలీఫ్‌) అనివార్యమవుతోంది. రోజుకు రెండు, మూడు గంటలకుపైగా పల్లె, పట్టణమన్న తేడా లేకుండా కరెంట్‌ కోత విధిస్తున్నారు.

జిల్లాలో అన్ని కేటగిరీలూ కలిపి 2,87,725 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ విద్యుత్‌ కనెక్షన్లే 2,36,917. ఈ కాలంలో సాధారణంగా జిల్లాలో 80 మెగావాట్ల విద్యుత్‌ వినియోగమయ్యేది. ప్రస్తుతం మండుతున్న ఎండలతో వినియోగం అమాంతం పెరిగింది. వంద మెగావాట్లకు చేరింది. దీనికితోడు వ్యవసాయ కనెక్షన్లకు అదనంగా మరో 10 మెగావాట్లు అవసరం అవుతోంది. అదనపు వినియోగానికి సరిపడా ఉత్పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల.. ఉక్కబోత వల్ల ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈఎల్‌ఆర్‌ పేరిట కరెంటు కోతలు విధిస్తున్నారు. పగలూరాత్రి తేడా లేకుండా కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement