భద్రత లేని బడి | - | Sakshi
Sakshi News home page

భద్రత లేని బడి

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

సీతంపేట:

పై చిత్రంలో రచ్చబండ వద్ద కూర్చుని చదువుకుంటున్న వారు మండలంలోని తోరికవలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. వీరు చదువుకుంటున్న పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ ఒకటి నుంచి ఐదోతరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 29 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పెచ్చులూడి కిందపడుతుండడంతో ఉపాధ్యాయులు ఐటీడీఏ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో పాఠశాల నిర్వహించాలని అధికారులు సూచించారు. అక్కడ స్థలం లేదంటూ అంగన్‌వాడీ నిర్వాహకులు ఇవ్వకపోవడంతో ఇదిగో ఇలా వెదురు కర్రలపై పరజా వేసి రచ్చబండపై చదువులు కొనసాగిస్తున్నారు. అలాగే ఎగువదరబలో సైతం పూర్తిగా భవనం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వెదురు కర్రలతో నిర్మించిన ఒక షెడ్‌లో పాఠాలు బోధిస్తున్నారు.

రాయిలంక జీపీఎస్‌ పాఠశాల పూర్తిగా శిఇలావస్థకు చేరుకుని కొద్ది నెలల కిందట ఒక గది కూలింది. దీంతో వీరు కూడా వేరే చోట వెదుర్ల షెడ్డులో బోధన సాగిస్తున్నారు. చావిడివలసలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను మోడల్‌ పాఠశాలగా మార్చినా అక్కడ భవనాలు లేవు. హెచ్‌ఎం సొంత నిధులతో రెకుల షెడ్డులు వేసి పాఠశాల నిర్వహించుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాథమిక పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి.

దయనీయంగా ప్రాథమిక విద్య

గిరిజన గ్రామాల్లో ప్రాథమిక విద్య దయనీయంగా మారుతోంది. విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందిందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో తగిన భవనాలు లేకపోవడం, ఉన్నవి శిథిలావస్థకు చేరుకోవడం వంటికారణాలతో పునాది స్థాయిలో ఉన్న ప్రాథమిక విద్యకు గండిపడుతోంది. వానొస్తే విద్యార్థులు, ఉపాధ్యాయుల వెన్నులో వణుకు పుడుతోంది. బాల,బాలికలు బిక్కు,బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సురక్షిత గదులు చదువుకోవడానికి కరువవుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 189 గిరిజన ప్రాథమిక పాఠశాలలున్నాయి. మండల పరిషత్‌, జీఈఎస్‌ పాఠశాలలు 108 వరకు ఉన్నాయి. మొత్తం సుమారు 8వేల మంది బాల,బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి బోధన సాగుతోంది. గిరిజన ప్రాథమిక పాఠశాలలు (జీపీఎస్‌) చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి.

ఇదీ పరిస్థితి..

21 గిరిజన ప్రాథమిక పాఠశాలలు (జీపీఎస్‌) శిథిలావస్థలో ఉన్నాయి. మరో పదికిపైగా రేకుల షెడ్డులలో నడుస్తున్నాయి. 150కిపైగా పాఠశాలలకు సరైన తలుపులు,కిటీకీల వంటివి సరిగా లేవు. గచ్చులు, శ్లాబ్‌పై పెచ్చులు ఊడిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తుంంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

కొత్త భవనాలకు ప్రతిపాదనలు పెట్టాం

ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌ శాఖ ద్వారా 35 జీపీఎస్‌ పాఠశాలలకు కొత్త భవనాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే నిర్మించనున్నాం. అంతవరకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తాం.

వెదురు, రేకుల షెడ్డుల్లో పాఠాలు

వానొస్తే వణుకే

సురక్షిత తరగతి గదులు కరువు

బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement