క్షేత్రస్థాయిలో ఆచరణ శూన్యం..
సాక్షి టాస్క్ ఫోర్స్: పార్వతీపురం మండలంలోని డీకే పట్నం రెవెన్యూ పరిధిలో జల వనరులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. చెరువుల పరిరక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ, స్థానికంగా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల (తెలుగు తమ్ముళ్లు) అండదండలతో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకు కేంద్రబిందువైన చెరువులను ఇష్టారాజ్యం ఆక్రమించి, వ్యాపారంగా మారుస్తున్న తీరుపై స్థానిక గిరిజన, బొడ్డవలస గ్రామ రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉన్నతాధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పూర్తిగా ఆక్రమించారు..
డీకే పట్నం గ్రామంలోని సర్వే నంబర్లు 115/3, 126, 129/2 పరిధిలో సుమారు 9.35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ చెరువులను అధికార పార్టీ శ్రేణులు పూర్తిగా ఆక్రమించారు. చెరువు గర్భంలో పామాయిల్ తోటలు సాగు చేస్తూ, దాని సహజసిద్ధమైన నీటి నిల్వ సామర్థ్యాన్ని, నీటి ప్రవాహ మార్గాలను పూర్తిగా ధ్వంసం చేశారు. వాల్టా చట్టం, బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్‌కు తూట్లు పొడుస్తూ సాగుతున్న ఈ అక్రమ దందాపై స్థానికులు మండిపడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద చెరువులో పూడికతీత పనులు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నించినా, తమ పలుకుబడితో ఆ పనులను నిలిపివేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా, పాఠశాల ఆవరణలోని టేకు చెట్ల నరికివేత, దళితుల రుణాలు పక్కదారి పట్టడం, దీపం పథకం గ్యాస్ కనెక్షన్ల విక్రయం వంటి అవకతవకలకు సైతం డీకే పట్నానికి చెందిన స్థానిక నాయకులే కేంద్ర బిందువుగా మారారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.16 లక్షలకు చెరువు విక్రయం..
తాజాగా ఈ కబ్జా బాగోతం సరిహద్దులు దాటింది. అక్రమార్కులు డీకే పట్నం పరిధిలోని కృష్ణసాగరం చెరువులోని కొంత భాగాన్ని మూకుమ్మడిగా ఒడిశాకు చెందిన కొందరికి ఏకంగా రూ.16 లక్షలకు విక్రయించినట్లు తెలుస్తోంది. భూమిని కొనుగోలు చేసిన సదరు వ్యక్తులు ఇటీవల దానిని స్వాధీనం చేసుకునేందుకు గ్రామానికి రాగా, బొడ్డవలస గ్రామస్తులు, గిరిజన రైతులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ప్రభుత్వ చెరువును ఎలా కొనుగోలు చేస్తారని, మీకెవరు విక్రయించారంటూ నిలదీయడంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెనుదిరిగారు. తమ జీవనాధారమైన జల వనరులను ఇలా ఇష్టానుసారం కబ్జా చేసి అమ్ముకుంటుంటే స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం కళ్లప్పగించి చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన ప్రాంతాల్లో ప్రకృతి, జల వనరులే జీవనాధా రం. తరతరాలుగా ఈ చెరువుల మీదే ఆధారపడి మా ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్నాం. సహజసిద్ధమైన ఈ నీటి వనరులు ఆక్రమణలకు గురైతే సహజమైన వనరుల మూలాల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. దయచేసి అధికారులు, ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుని ఈ సహజ వనరులను కాపాడి గిరిజన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నాం.
–జిలకర్ర భాస్కరరావు, రైతు, బొడ్డవలస
సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తే గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం మరింతగా బాగుపడుతుంది. గిరిజనులకు మరింత ఆసరాగా ఉంటుంది. కానీ, ఉన్న చెరువులు ఆక్రమణల పాలవడం ఎంతో ఆవేదన కలిగిస్తోంది. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, చెరువులను అభివృద్ధి చేసి రైతులకు అండగా నిలవాలని మనవి చేస్తున్నాం.
–పీడిక అప్పన్న, బొడ్డవలస గ్రామస్తుడు
చెరువు గర్భాల్లో అక్రమాలను సహించేది లేదని, ఆక్రమణలు తొలగిస్తామని కలెక్టర్, ప్రభుత్వ పెద్దలు పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణ శూన్యంగా మారింది. పక్కా ఆధారాలతో కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు వెళ్లినా, అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకే స్థానిక రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, మ్యాపింగ్ ద్వారా చెరువుల అసలు హద్దులను గుర్తించి, దోపిడీకి పాల్పడుతున్న ఆక్రమణదారులపై వాల్టా చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు.
చెరువులను మింగేస్తున్న కబ్జా దారులు
రూ. 16 లక్షలకు ఒడిశా వాసులకు కృష్ణసాగరం విక్రయం?
స్వాధీనానికి రాగా అడ్డుకున్న బొడ్డవలస గిరిజన రైతులు
అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే దందా
చోద్యం చూస్తున్న క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం


