● ఖైదీల్లో మానసిక పరివర్తనే కీలకం
పార్వతీపురం రూరల్: కారాగారం కేవలం శిక్షలకే పరిమితం కాదని, అది మానసిక పరివర్తనకు, ప్రవర్తనా సంస్కరణలకు వేదిక కావాలని పార్వతీపురం రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి స్పష్టం చేశారు. స్థానిక సబ్ జైలు వద్ద జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖైదీలకు శనివారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. గతాన్ని సమీక్షించుకుని, చేసిన తప్పులను సరిదిద్దుకుని నవ జీవనం వైపు అడుగులు వేయాలని సూచించారు. విద్యావకాశాలు కోల్పోయిన వారు సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా చదువును కొనసాగించి, ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలన్నారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖైదీల ప్రవర్తనలో గుణాత్మక మార్పు తీసుకురావడమే జైళ్ల శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వృత్తి నైపుణ్య శిక్షణ, విద్యావకాశాలు ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. జైలులో వసతులు, ఆరోగ్యం, భోజన సదుపాయాలను ప్రత్యేక కమిటీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు. జైలు జీవితాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని, సానుకూల దృక్పథంతో సమాజంలోకి అడుగుపెట్టాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.కృష్ణప్రసాద్, డీఆర్వో కె.హేమలత, డీఈఓ పి.బ్రహ్మాజీరావు, జిల్లా వైద్యాధికారి, ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు.


