పార్వతీపురం రూరల్: శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు పార్వతీపురం మన్యం ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘పోలీస్ వెల్ఫేర్ డే’ (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందితో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరి వినతులను సావధానంగా ఆలకించిన ఆయన, వాటి పూర్వాపరాలు పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో నిమగ్నమయ్యే సిబ్బంది ఆరోగ్య, శాఖాపరమైన ఇబ్బందులను తీర్చేందుకు వేగంగా చర్యలు చేపడతామన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలలో ప్రధానంగా అనారోగ్య సమస్యలు, బదిలీలు కోరుతూ వచ్చినవే ఎక్కువగా ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే సిబ్బందికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో సీసీ సంతోష్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ మాధవ్ రెడ్డి


