● పోర్టల్‌లో ఉన్నా..కళాశాలకు వెళ్తున్నారా?
● ప్రైవేట్ ఐటీఐలపై అనుమానాలు
● ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు, పరికరాల పరిస్థితిపై..
● విద్యార్థి సంఘాల ఆందోళన
విజయనగరం అర్బన్: బోధకుడు ఉంటేనే అడ్మిషన్.. పరికరాలుంటేనే ప్రాక్టికల్ శిక్షణ. అంటూ కేంద్రప్రభుత్వం కొత్త నిబంధనలు ఈ ఏడాది తీసుకొచ్చినా..జిల్లాలోని ప్రైవేట్ ఐటీఐల్లో పరిస్థితి ఎంతవరకు మారిందన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాల ప్రక్రియ తాజాగా ముగిసింది. తరగతులు ప్రారంభమయ్యాయి. అడ్మిషన్‌లకు ముందు ఇన్‌స్ట్రక్టర్ల వివరాలు, వారి అర్హత ధ్రువీకరణ పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయించి పరిశీలించినప్పటికీ..క్షేత్రస్థాయిలో అదే స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని 26 ప్రైవేట్ ఐటీఐల్లో సుమారు 4,300 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ వంటి ప్రధాన ట్రేడుల్లోనే వేలాది సీట్లు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరిన నేపథ్యంలో వారికి అవసరమైన ఇన్‌స్ట్రక్టర్లు, ల్యాబ్‌లు, యంత్ర పరికరాలు, వర్క్‌షాప్‌లు అందుబాటులో ఉన్నాయా? అనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ అవసరమని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. సీట్ల సంఖ్యను బట్టి చూస్తే శిక్షణ వసతులు కూడా అదే స్థాయిలో ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్ వంటి ట్రేడుల్లో పుస్తకాలతో మాత్రమే శిక్షణ పూర్తయ్యే పరిస్థితి ఉండదు. యంత్రాలు, పరికరాలను వినియోగిస్తూ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రతి సంస్థలో అనుమతించిన సీట్లకు అనుగుణంగా పరికరాలు, ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు ఉన్నాయా? అన్నది కీలకంగా మారింది.
అడ్మిషన్ తర్వాత అసలు పరీక్ష
అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ఇప్పుడు అసలు పరీక్ష ప్రారంభమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు చేరారు. ఇక వారికి నాణ్యమైన శిక్షణ అందుతోందా? అన్నది అధికారులు పరిశీలించాల్సిన అంశంగా మారింది. ఇన్‌స్ట్రక్టర్లు పాఠ్యాంశాల ప్రణాళికను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉండగా.. భవిష్యత్తులో బోధన ప్రక్రియను సంబంధించిన వీడియోలను కూడా అప్‌లోడ్ చేసే విధానం తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు అధికారులు గతంలో వెల్లడించారు. ఇది అమల్లోకి వస్తే తరగతుల నిర్వహణపై కొంత మేర పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉంది.
బోగస్‌కు బ్రేక్ పడిందా?
ఇన్‌స్ట్రక్టర్లు, సౌకర్యాల విషయంలో కొన్ని ప్రైవేట్ ఐటీఐలపై విద్యార్థి సంఘాలు గతంలో ఫిర్యాదులు చేశాయి. ఇన్‌స్ట్రక్టర్లు లేకపోయినా ఉన్నట్లు చూపించడం, అవసరమైన పరికరాలు లేకుండానే ట్రేడులు నిర్వహించడం వంటి ఆరోపణ లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సంఘాల ప్రతి నిధులు చెబుతున్నారు. కొత్త నిబంధనలతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ.. అడ్మిషన్లు పూర్తయిన తర్వాత కూడా తనిఖీలు కొనసాగించాల్సి అవసరం ఉందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి.
పర్యవేక్షణ బాధ్యతపై ఆదేశాలు రావాలి
కేంద్రప్రభుత్వం కొత్త నిబంధనల మేరకు ఈ ఏడాది ప్రైవేటు ఐటీఐల ప్రవేశాలకు ముందు బోధన అందించబోతున్న ఇన్‌స్ట్రక్టర్ వివరాలను ఎస్‌ఐడీహెచ్ అనే ప్రత్యేక పోర్టర్‌లో నమోదు చేశాం. ఇన్‌స్ట్రక్టర్లు నమోదైన కోర్సులలో మాత్రమే ప్రవేశాలకు అనుమతి ఇచ్చాం. పోర్టల్‌లో నమోదైన ఇన్‌స్ట్రక్టర్ల హాజరు, విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్, ల్యాబ్ వినియోగం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యతకు సంబంధించిన ఆదేశాలు ఇంకా రావాల్సి ఉంది.
టీ.వీ.గిరి, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్,
జిల్లా కన్వీనర్, విజయనగరం
పోర్టల్‌లో ఉన్నా..కాలేజీకి వెళ్తున్నారా?
కొత్త నిబంధనల ప్రకారం సంబంధిత ట్రేడుల్లో పనిచేసే ఇన్‌స్ట్రక్టర్ల వివరాలు, ధ్రువీకరణ పత్రాలు ఎస్‌ఐడీహెచ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి వచ్చింది. నోడల్ కళాశాల కన్వీనర్ వాటిని పరిశీలించి ఆమోదించిన తర్వాతే ప్రవేశాలకు అనుమతి లభించింది. అయితే పోర్టల్‌లో ఇన్‌స్ట్రక్టర్ పేరు ఉండడం..వాస్తవంగా ప్రతిరోజూ తరగతిలో బోధించడం రెండూ ఒకటేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్‌స్ట్రక్టర్ల హాజరు, విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్, ల్యాబ్ విని యోగం తదితర అంశాలపై కూడా పర్యవేక్షణ ఉండాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.


