ఆధారాల వేటకు.. ‘ఆధునిక’ రథం | - | Sakshi
Sakshi News home page

ఆధారాల వేటకు.. ‘ఆధునిక’ రథం

Sep 19 2026 12:52 AM | Updated on Sep 19 2026 12:52 AM

ఆధారాల వేటకు.. ‘ఆధునిక’ రథం

మన్యం జిల్లాకు మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం

● నిశితంగా పరిశీలించిన ఎస్పీ మాధవ్‌ రెడ్డి

పార్వతీపురం రూరల్‌: నేర దర్యాప్తులో సాంకేతికతకు పెద్దపీట వేస్తూ, ఆధారాల అన్వేషణను మరింత పదునెక్కించేందుకు పార్వతీపురం మన్యం జిల్లాకు అత్యాధునిక ’మొబైల్‌ ఫోరెన్సిక్‌ యూనిట్‌’ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా కేటాయించిన ఈ వాహనాన్ని శుక్రవారం ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి స్థానిక పోలీసు కార్యాలయంలో పరిశీలించారు. వాహనంలోని పరికరాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేరస్థలంలో లభించే చిన్న ఆధారం కూడా కేసు కొలిక్కి రావడంలో కీలకమే. నిందితులు ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేసినా, పక్కాగా వాటిని వెలికితీసేలా ఈ వాహనంలో సదుపాయాలున్నాయి. ఇందులో హై–ఇంటెన్సిటీ లైట్లు, రక్తపు, డీఎన్‌ఏ నమూనాల సేకరణ కిట్లు, మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాల స్క్రీనింగ్‌ కిట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆధారాల డాక్యుమెంటేషన్‌ కోసం స్టీరియో మైక్రోస్కోప్‌, డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా, డిజిటల్‌ ఇన్వెస్టిగేషన్‌ కిట్‌, ఫోరెన్సిక్‌ ఇమేజర్‌, ఫీల్డ్‌ ట్రయాజ్‌ టూల్స్‌ వంటివి పొందుపరిచారు. ఘటనా స్థలంలోనే తక్షణమే ఆధారాలను సేకరించడం వల్ల అవి కనుమరుగయ్యే లేదా రూపాంతరం చెందే ప్రమాదం తప్పుతుందని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. తద్వారా న్యాయస్థానాల్లో నేరాన్ని సులువుగా నిరూపించవచ్చన్నారు. దర్యాప్తు వ్యవస్థను ఆధునికీకరిస్తూ ఈ వాహనాన్ని మంజూరు చేసిన డీజీపీకి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ, ఎస్సై నీలకంఠం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement