ఐటీడీఏ వద్ద గిరిజనుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ వద్ద గిరిజనుల ధర్నా

Sep 19 2026 12:52 AM | Updated on Sep 19 2026 12:52 AM

ఐటీడీఏ వద్ద గిరిజనుల ధర్నా

ఆర్డీవో, తహసీల్దార్‌పై చర్యలకు డిమాండ్‌

పార్వతీపురం రూరల్‌: ముందస్తు నోటీసులు లేకుండా సాగులో ఉన్న భూములను ఆక్రమించి, జీడిమామిడి తోటలను ధ్వంసం చేసిన బొబ్బిలి ఆర్డీవో, రామభద్రపురం తహసీల్దార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజనులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.రామస్వామి మాట్లాడుతూ..ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని పుల్లేరు గుడ్డువలస, వంగర గుడ్డువలస, జాకరమ్మ కొత్తవలస గ్రామాలకు చెందిన 60 కుటుంబాలు రామభద్రపురం మండలం కొట్టక్కి రెవెన్యూ పరిధిలో సుమారు 100 ఎకరాల్లో 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాయన్నారు. 2009లో 17 కుటుంబాలకు అటవీ పట్టాలు కూడా ఇచ్చారని తెలిపారు. అయితే, ఈ నెల 9న రెవెన్యూ, పోలీసు అధికారులు యంత్రాలతో వచ్చి పంటలను ధ్వంసం చేసి, అడ్డుకున్న రైతులను అరెస్టు చేశారని ఆరోపించారు. 2017లో ఏపీఐఐసీకి ఇచ్చిన ఈ భూమిని ప్రస్తుతం ‘రాధిక ఆయిల్స్‌ అండ్‌ మినరల్స్‌’కు విక్రయించామని చెబుతూ, దౌర్జన్యంగా పంటలను నాశనం చేసిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని, పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అది రెవెన్యూ భూమి అయితే 2009లో అటవీ పట్టాలు ఎలా ఇచ్చారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు ప్రశ్నించారు. సాగుదారులకు భూసేకరణ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి, జిరాయితీతో సమానంగా పరిహారం చెల్లించాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించారని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు ఆక్షేపించారు. గిరిజనులకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు జాంబ్రి, రంజు, వెంకట్‌, మోహన్‌, కస్తూరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement