బాలల హక్కుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Sep 19 2026 12:52 AM | Updated on Sep 19 2026 12:52 AM

బాలల హక్కుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

● డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి డాక్టర్‌ కృష్ణప్రసాద్‌

విజయనగరం లీగల్‌: విద్యా సంస్థల్లో విద్యార్థులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించడంలో ఉపాధ్యాయులు, లెక్చరర్లు అత్యంత కీలకపాత్ర పోషించాలని, బాలల హక్కులను పరిరక్షించడం సమాజంలో ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, న్యాయమూర్తి డాక్టర్‌ ఎ.కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర ఏఐఏటీ జూనియర్‌ కళాశాలలో డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘బాలల రక్షణ అంశాల’పై అవగాహన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బాలలపై జరిగే హింస, లైంగిక వేధింపులు, దాడులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ’పోక్సో చట్టం’తో పాటు బాలల రక్షణకు సంబంధించిన వివిధ చట్టాలపై ఉపాధ్యాయులు, లెక్చరర్లు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులలో ఆకస్మికంగా కనిపించే ప్రవర్తనా మార్పులు, భయం, మానసిక ఒత్తిడి లేదా ఇతర సమస్యలను అధ్యాపకులు సున్నితంగా పరిశీలించాలని కోరారు. ఏవైనా సంక్షోభ పరిస్థితులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి, బాధిత బాలలకు అవసరమైన న్యాయసాయం, రక్షణ అందేలా సహకరించాలని పిలుపునిచ్చారు. బాలల హక్కుల రక్షణలో పాఠశాలలు, కళాశాలలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ శాఖల మధ్య నిరంతర సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. చట్టపరమైన లేదా ఉచిత న్యాయ సహాయం కావాల్సిన వారు టోల్‌ ఫ్రీ నంబర్‌ 15100ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ప్యానెల్‌ అడ్వకేట్‌ పైలా సురేష్‌ కుమార్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐఓ తవిటినాయుడు, డిప్యూటీ డీఈవో రమణమ్మ, కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ గుప్తా, వివిధ కళాశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement