పిల్లలను ఇచ్చేందుకు వెనకాడే పరిస్థితి
● పెదపెంకి గ్రామంలో 200మందికి పైగా వ్యాధిగ్రస్తులు ● మందులు వాడితేనే నొప్పికి ఉపశమనం
సాక్షి, పార్వతీపురం మన్యం:
అడుగు తీసి అడుగు వేయలేరు.. పెద్ద పెద్ద బండలను కట్టుకుని మోస్తున్నట్లు, మెలిపెట్టి తిప్పేసినట్లుగా కాళ్లు.. భరించలేనంత నొప్పితో విలవిలలాడుతున్నా.. భరిస్తూనే సాగిపోతోంది వారి జీవ నం. ఒకటా, రెండా.. దాదాపు నాలుగు దశాబ్దాలు. ఒకరా, ఇద్దరా వందల్లో బాధితులు. శరీరానికే కాదు .. వారి జీవితాల్లో సైతం నొప్పి, అవమానం, ఆర్థిక ఇబ్బందులు కలిసి వెంటాడుతున్నాయి. చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా.. పూర్తి స్థా యి ఉపశమనం దొరకక బాధితుల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో వందలాది మంది నిత్యం పడే బోదకాలు వ్యాధి బాధలివి.
పెదపెంకి గ్రామంలో బోదకాలు వ్యాధిగ్రస్తులు వందలాది మంది ఉన్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఈ వ్యాధి ఇక్కడి వారి జీవితంలో ఒక భాగమైపోయింది. నిత్యం వారు పడే బాధలు అన్నీఇన్నీ కావు. గ్రామ జనాభా సుమారు 12 వేలు. దాదాపు అందరికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 3 వేల మంది బాధితులున్నారు. ఒక్క పెదపెంకి గ్రామంలోనే ప్రస్తుతం 250 మంది వరకు ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. వ్యాధితో మానసికంగా కుంగిపోయిన వారు కొందరైతే.. ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఇంకొందరు.
కారణాలేమైనా సరే.. కుంగిపోవాల్సిందే
దశాబ్దాలుగా వ్యాధి పట్టి పీడిస్తున్నా కారణాలపై సరైన స్పష్టత రావడం లేదు. దోమలు, పారిశుద్ధ్య లోపమే కారణమని చెబుతున్నారు. ఎస్సీ కాలనీ వైపు ఉన్న తాగునీటి ట్యాంకరు నీరు కూడా కారణమని కొందరు భావిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం గ్రామంలో పైలేరియా నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొద్ది రోజులకే అది మూతపడింది. సాధారణంగా బోద అంటే కాలికే ఎక్కువగా సోకుతుంది ఇక్కడ కాళ్లు, చేతులతోపాటు ఛాతీపైనా వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. నెలకు పింఛన్ రూ.4 వేల నుంచి రూ.6 వేల చొప్పున అందుకున్న వారూ ఉన్నారు. కొందరు సామాజిక పింఛన్లు అందుకుంటున్నారు. మందులకే ఆ మొత్తం సరిపోతోంది. ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తున్నా, పని చేయడం లేదని.. అందుకే బయట కొనుగోలు చేసుకుంటున్నామని బాధితులు చెబుతున్నారు. ఇక్కడ వ్యాధి తీవ్రతపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.6 కోట్లకుపైగా నిధులు మంజూరు చేయించారు. ఆ నిధులతో మ్యాజిక్ డ్రైన్లు, సీసీ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. గత మార్చి నెలలో ప్రారంభమైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి వల్ల ఉన్న సమస్య పరిష్కారం కాకపోగా.. కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
మా గ్రామంలో బోద వ్యాధి తీవ్రత వల్ల ఒకానొక దశలో ఈ ఊరిలో పిల్లలను చేసుకునేందుకు చాలా మంది అయిష్టత చూపేవారు. సుమారు 40 ఏళ్లుగా వ్యాధి తీవ్రత ఉంది. ఐదేళ్లుగా కొత్తగా కేసులు నమోదు కానప్పటికీ.. ఉన్నవారు మందులు వాడుకుంటూ గడుపుతున్నారు. పారిశుద్ధ్యం, దోమల బెడద తగ్గించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోట్లాది రూపాయల నిధులు ఇచ్చారు. కానీ, ఇక్కడ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. దీనివల్ల కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి. – గులిపిల్లి అప్పలనాయుడు, పెదపెంకి


