పార్వతీపురం రూరల్: శిల్పకళ, వాస్తుశాస్త్రం, యంత్ర సాంకేతికానికి ఆద్యుడు, ప్రపంచ తొలి వాస్తుశిల్పి శ్రీ విశ్వకర్మ అని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, దేవశిల్పి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. విశ్వకర్మ కేవలం దేవతల శిల్పి మాత్రమే కాద ని, చేతివృత్తుల కళాకారులకు, ఇంజనీర్లకు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలకు ఆదర్శప్రాయుడన్నారు. కృష్ణుడు పాలించిన ద్వారకానగరం వంటి అద్భుత కట్టడాలను ఆయన నిర్మించినట్లు పురాణాలు చెబు తున్నాయని గుర్తుచేశారు. ఆధునిక యుగంలోనూ ఆయన సృజనాత్మక సిద్ధాంతాలు, నిర్మాణ శాస్త్ర సూత్రాలు ఎంతో ఆచరణీయమని స్పష్టం చేశారు. పట్టుదల, కష్టపడే తత్వం, వృత్తి నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చనే సందేశాన్ని ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పాలకొండ, ఏఆర్ డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి, సీఐలు రమణమూర్తి, మారూఫ్, జీఏవీ రమణ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది నివాళులర్పించారు.


