డెంకాడ: యువత సమాజానికి ఆదర్శంగా, చైతన్యాన్ని కలిగి ఉండాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. డెంకాడ పోలీస్‌స్టేషన్ ఆవరణంలో యువత స్ఫూర్తి సమ్మేళనం పేరిట వివిధ అంశాలపై అవగాహన సమావేశాన్ని గురువారం నిర్వహించారు. దీనిలో ఎస్పీ మాట్లాడుతూ యువత మంచిని ప్రజలకు చెప్పి చైతన్యవంతులను చేయాలన్నారు. తమ పిల్లలు ఉన్నతంగా ఉండాలని పిల్లల తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకు, ఇబ్బందులకు ఓర్చి చదివిస్తున్న విషయం విద్యార్థులు మరవరాదన్నారు. కొన్ని నేరాల్లో యువకులు ఎక్కువగా ఉండటం చాలా బాధాకరమన్నారు. గంజాయి అమ్మినా, కొన్నా, సేవించినా, రవాణా చేసినా చట్టపరంగా కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొన్ని నేరాల్లో మరణ శిక్ష కూడా పడుతుందన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు తప్పదని చెప్పారు. బాలికలపై, మహిళలపై నేరాలకు పాల్పడితే పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నాయని చెప్పారు. బెట్టింగ్‌లతో కొందరు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వివరించారు. ఆన్‌లైన్ కాల్స్ ట్రాప్‌లో పడవద్దని సూచించారు. విద్యార్థులు నేరాలకు పాల్పడి ఒక్కసారి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా రాకుండా పోతాయన్నారు. యువత సమాజంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. గంజాయికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువత పాల్గొన్నారు.


