సంతకవిటి: మండలంలోని తల్లీకొడుకులు అదృశ్యంపై కేసు నమోదైనట్టు ఎస్‌ఐ ఆర్.గో పాలరావు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మిర్తివలస గ్రామానికి రాజాపు రమేష్‌కు పొందూరు మండలానికి చెందిన దంతేశ్వరితో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు దేవార్ష(3) ఉన్నాడు. సోమవారం ఉదయం రమేష్ గ్రామంలో పని వద్ద ఉండగా తన భార్య కుమారుడుని తీసుకుని వెళ్లడం చూసి ఎక్కడకు అని అడగగా సచివాలయానికి అని తెలిపింది. అనంతరం మధ్యాహ్నం తను ఇంటికి భోజనానికి వచ్చే సరికి తన భార్య, కుమారుడు ఇంటిలో లేకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీనితో తెలిసిన వారి దగ్గర వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో మంగళవారం రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధం
వీరఘట్టం: మండలంలోని తలవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణంలో ఉన్న ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మంగళవారం బ్లాస్ట్ అయింది. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఒక్కసారి మంటలు రావడంతో స్థానికులు, హైస్కూల్ విద్యార్థులు భయాందోళన చెందారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న కరెంటు ఆయిల్‌కు నిప్పు అంటుకోవడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. అనంతరం పాలకొండ అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాఠశాల ఆవరణలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే తొలగించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
నీళ్లని భ్రమించి గడ్డిమందు తాగిన వ్యక్తి
పార్వతీపురం రూరల్: మద్యం మత్తు ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. కొమరాడ మండలం గుణానపురం గ్రామానికి చెందిన రౌతు శ్రీనివాసరావు మద్యం సేవించి ఉన్నాడు. విపరీతమైన దాహం వేయడంతో, మత్తులో పక్కనే ఉన్న గడ్డి మందును నీళ్లుగా భ్రమించి తాగాడు. అదృష్టవశాత్తూ కొద్ది మోతాదులోనే మింగడంతో పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆయనను పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. సత్వర వైద్యం అందడంతో ప్రస్తుతానికి శ్రీనివాసరావు పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
వంగర: మండల పరిధి శివ్వాం గ్రామానికి చెందిన అంబళ్ల వెంకటనాయుడు(38) గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ షేక్ శంకర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన గడ్డిమందు తాగాడని, భార్య నిర్మల సహాయంతో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స అందించారన్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందారన్నారు. మృతుడు భార్య నిర్మల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడుకి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
శృంగవరపుకోట: మండల పరిధిలో వేములాపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం సాయంత్రం ఉరి వేసుకుని ఉసురు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వేములాపల్లి గ్రామానికి చెందిన లగుడు సుధాకర్ (35) విశాఖలో నేవీలో ఎం.టి.ఎస్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను భార్య, ఇద్దరు మగ పిల్లలతో విశాఖలోని బాజీ జంక్షన్‌లో నివాసం ఉంటున్నాడు. సుధాకర్ బంధువుల వివాహానికని ఈ నెల 22న కుటుంబ సభ్యులతో ఇక్కడకు వచ్చాడు. వివాహం అనంతరం ఈ నెల 24న కుటుంబ సభ్యులను కొత్తవలసలో బస్సు ఎక్కించి విశాఖపట్నం పంపించాడు. తరువాత వేములాపల్లికి తిరిగి వచ్చిన సుధాకర్ మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. గ్రామ సమీపంలోని జంగం గుడి సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నారాయణమూర్తి తెలిపారు.


