ప్రత్యేకాధికారి మార్పువెనుక
ఒత్తిళ్లు పని చేశాయా?
ఆర్డీఓ మాధురి నెట్టుకురాగలరా?
అధికార బదిలీలపై పార్వతీపురం పట్టణంలో జోరందుకున్న చర్చ
సాక్షి, పార్వతీపురం మన్యం:
పార్వతీపురం గ్రేడ్–1 మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి ఆర్డీఓ మాధురికి అప్పగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అకస్మాత్తుగా ఈ మార్పు నిర్ణయం వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లు, పురాలు, నగర పంచాయతీల్లో పాల కవర్గ పదవీకాలం ముగిసిన తర్వాత, ప్రత్యేక అధికారుల పాలన తెరపైకి వచ్చిన విషయం విదిత మే. ఇందులో భాగంగా పార్వతీపురం గ్రేడ్–1 మున్సిపాలిటీకి తొలుత సంయుక్త కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. కార్పొరేషన్‌లు, గ్రేడ్ –1 మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులుగా కలెక్టర్లు ఉండాలన్న నిర్ణయంతో.. అప్పటి జేసీ యశ్వంత్ కుమార్‌రెడ్డిని సాలూరు మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా.. పార్వతీపురానికి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ని నియమించారు. యశ్వంత్‌కుమార్‌రెడ్డికి బదిలీ కాగా.. ప్రస్తుతం ప్రస్తుతం సాలూరుకు ఇన్‌చార్జి జేసీ వైశాలి ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి ఆ బాధ్యతల నుంచి మార్పుచేస్తూ, పార్వతీపురం ఆర్డీఓ మాధురికి అప్పగించడం వెనుక ఉద్దేశం ఏమిటన్న చర్చ పట్టణంలో జోరందుకుంది.
కలెక్టర్ ప్రభాకరరెడ్డితో జిల్లాలోని ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులకు పొసగని విషయం తెలిసిందే. ప్రధానంగా పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యేతో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నట్లు పలుమార్లు రుజువైంది. కలెక్టర్‌పై నియోజక వర్గానికి చెందిన ఓ వర్గం టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. అవకాశం దొరికినప్పుడలా ఇరికించేందుకు ప్రయత్ని స్తున్నారు. తమదారిలోకి తెచ్చుకునేందుకు ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఆయనను జిల్లా నుంచి బది లీ చేయించాలని తీవ్రంగా ప్రయత్నించారు. ప్రస్తుతానికి వారి ప్రయత్నం ఫలించక పోయినప్పటికీ.. మున్సిపల్ పాలనా వ్యవహారాలు, కొన్ని నిర్ణయా లు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో కలెక్టర్/ప్రత్యే కాధికారి వైఖరి పట్ల ఎమ్మెల్యే విజయ్‌చంద్ర గుర్రు గా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది.
పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు ప్రక్రి య సందిగ్ధంలో ఉన్నప్పటికీ.. ఇంకా సమయం ఉండడంతో, ఏ నిర్ణయం అయినా వెలువడచ్చన్న అభిప్రాయంతో పార్టీల నాయకులు ఉన్నారు. ఒకవేళ ఎన్నికలు జరిగితే.. ప్రత్యేక అధికారి నుంచి అధికా ర పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయ్ చంద్రకు ఇబ్బందికర పరిణామాలు ఎదురుకావచ్చన్న అనుమానా లు టీడీపీలో బలంగా ఉన్నాయి. మున్సిపాలిటీలో తాము అనుకున్న విధంగా పనులు జరగకపోతే, రానున్న ఎన్నికల సమయానికి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురు కావచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకొ చ్చి ప్రత్యేక అధికారి మార్పును చేశారా? అన్న ప్రశ్న లు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక అధికారి మార్పు తమ విజయంగా నియోజకవర్గానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు చెప్పుకుంటుండడం దీనికి బలం చేకూరుస్తోంది. త్వరలోనే కలెక్టర్ బదిలీ కూడా తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


