● వివిధ సమస్యలపై
211 వినతుల స్వీకరణ
● సమస్యలు పరిష్కరించండి :కలెక్టర్
విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన ప్రతి వినతినీ క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్–రెవెన్యూ క్లినిక్‌లో మొత్తం 211 వినతులు స్వీకరించగా..అందులో 106 రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ, సర్వే సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, భూ సర్వే, తదితర సమస్యలకు సంబంధించిన వినతులు అధికంగా వస్తున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమస్య పరిష్కరించిన తర్వాత అర్జీదారుడితో నేరుగా మాట్లాడి ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని తెలిపారు. వారితో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
1100 ఫిర్యాదులపైనా దృష్టి..
టోల్‌ఫ్రీ నంబర్ 1100 ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అర్జీదారుడితో మాట్లాడి సమస్యను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే 1100 సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
శాఖల వారీగా వచ్చిన వినతులు..
రెవెన్యూ శాఖకు 106, పంచాయతీరాజ్–31, డీఆర్‌డీఏ–14, విద్యశాఖ–05, మున్సిపల్–19, గ్రామ సచివాలయం–09, ఇతర శాఖలు–21, విద్యుత్–04, గృహనిర్మాణం–01, వైద్యారోగ్యశాఖకు ఒక వినతి వచ్చింది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఇ.మురళి, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు అరుణకుమారి, సూర్యకళ, సీపీఓ బాలాజీ, జిల్లా సర్వే ఎ.డి ఆర్.విజయకుమార్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్, డీపీఓ మల్లికార్జునరావు, డీఎంహెచ్‌ఓ జీవనరాణి, కలెక్టరేట్ ఏవో దేవీప్రసాద్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
నిర్ణీత గడువులోగా..
పార్వతీపురం: ప్రజలు తెలియజేసే సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుంచి వచ్చిన 106 వినతులను జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, తదితరులతో కలిసి స్వీకరించారు. వీటిలో 33 అర్జీలు రెవెన్యూకు సంబంధించినవి కాగా 73 ఇతర దరఖాస్తులు ఉన్నాయి. గ్రామీణ రహదారులకు మరమ్మతులు, దివ్యాంగుల పింఛన్లు, భూ ఆక్రమణలు, వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాల నమోదు, తదితర అంశాలపై అర్జీలు అందాయి. ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


