భామిని: మండల కేంద్రానికి చెందిన గిరిజన నిరుద్యోగి బిడ్డిక శివాజీని ఉద్యోగం పేరుతో మోసగించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు ఓ కూటమి నాయకుడు, మరో ఉపాధ్యాయుడు కారణమని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. శివాజీ బీఎస్సీ, అగ్రికల్చర్ డిప్లమో చేశాడు. బాధితుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకున్న సాలూరు మండలం దత్తివలసకు చెందిన కూటమి నాయకుడు మజ్జి నారాయణరావు, రేగిడి మండలం కాగితాపల్లి ఎంపీపీ స్కూల్‌లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు పాలకొండ ప్రభాకర్ అతడ్ని కలిసి ఎఫ్‌సీఐలో ఉద్యోగం ఇస్తామని నమ్మబలికారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకుని కొన్నాళ్లకు నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అయితే అపాయింట్‌మెంట్ ఆర్డర్ నకిలీదని తెలుసుకున్న శివాజీ ఈ నెల 14న బత్తిలి ఎస్సై కె. రవీంద్రకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన ఎస్సై నిందితులను సంప్రదించగా.. తామే స్వయంగా వచ్చి ఫిర్యాదుదారుడితో మాట్లాడతామని చెబుతూ తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎఫ్‌సీఐ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రాకుండా అపాయింట్‌మెంట్ ఎలా ఇచ్చారని బాధితుడు, తదితరులు నిందితులను గట్టిగా నిలదీస్తే ఉపాధ్యాయుడు ప్రభాకర్ తాము తీసుకున్న డబ్బులకు గాను రెండు చెక్కులు ఇచ్చాడు. అయితే ఈ చెక్కులు బౌన్స్ అవ్వడం విశేషం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రవీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గిరిజన నిరుద్యోగి నుంచి
రూ. నాలుగున్నర లక్షలు వసూలు
నమ్మించి మోసం చేసిన కూటమి నాయకుడు, ఉపాధ్యాయుడు


