ఏనుగుల దాడితో చేతికందిన పంటలు ధ్వంసం
లబోదిబోమంటున్న మన్యం రైతులు
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఒకవైపు నెలల తరబడి కష్టపడి సాగు చేస్తే.. మరోవైపు తెల్లవారుజామునే ఏనుగుల గుంపు చొరబడి చేతికందిన పంటలను క్షణాల్లో నేలమట్టం చేస్తున్నాయి. ఏం చేయాలో తెలియక రైతులు లబో దిబోమంటున్నారు. వరుసగా మండలాలు మారు తూ పంటలపై విరుచుకుపడుతున్న ఏనుగుల గుంపు..జిల్లా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో కొమరాడ మండలంలో ఎనిమిది ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పలువురు రైతులు సాగు చేస్తున్న పామాయిల్, పత్తి, బీర, వరి పంటలను ధ్వంసం చేశాయి. పంటలతో పాటు వరి సాగుకు ఉపయోగి స్తున్న విద్యుత్ పంప్‌మోటార్ సెట్‌ను కూడా ధ్వంసం చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుంకీ ఏనుగులు ఎక్కడ?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాకు తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయంటూ ప్రజా, గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సీతానగరం మండలానికి చేరి నెల రోజు లు గడుస్తున్నా, అడవి ఏనుగుల నియంత్రణకు వాటిని ఎందుకు రంగంలోకి దించడం లేదని సీపీఎం నాయకుడు సాంబమూర్తి ప్రశ్నిస్తున్నారు. కుంకీ ఏనుగులకు శిక్షణ ఇస్తున్నారా? లేక వాటిని ఇతర అవసరాల కోసం సిద్ధం చేస్తున్నారా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏనుగుల సమస్యకు తక్షణ, శాశ్వత పరిష్కారం చూపకపోతే రైతులందరితో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
నిత్యం ఏదో చోట..
ఏనుగుల గుంపు వరుసగా మండలాలు మారుతూ పంటలపై దాడులు చేస్తుండడం రైతులను మరింత కలవరపెడుతోంది. మొన్న జియ్యమ్మవలస మండలంలో పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు .. నిన్న గరుగుబిల్లి మండలంలో బీభత్సం సృష్టించినట్లు రైతులు చెబుతున్నారు. తాజాగా కొమరాడ మండలానికి చేరుకుని మరోసారి పంటలను నాశ నం చేశాయి. చేతికందే దశలో ఉన్న పంటలు ధ్వంసం కావడంతో కొమరాడ మండల కేంద్రానికి చెందిన రైతులు సింహాచలం, బి.తవిటి నాయుడు, మడక గౌరునాయుడు, మడక పకీరు, పోలినాయు డు తదితరులు ఆందోళన చెందుతున్నారు.
ఏళ్లుగా ఇదే తంతు..
ఏనుగులు పంటలను ధ్వంసం చేసిన ప్రతిసారీ అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి నష్టాన్ని పరిశీలించడం, ఆ తర్వాత నష్టపరిహారం ప్రక్రియ చేపట్టడం తప్ప సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ, ఏనుగుల దాడులను సమర్థవంతంగా అరి కట్టేందుకు పటిష్టమైన చర్యలు కనిపించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గజరాజుల వల్ల పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.


