కిలో రూ.75కు పెరిగిన ధర
పక్షం రోజుల క్రితం వరకు కిలో రూ.45
సామాన్యుడిపై అదనపు భారం
పండగల వేళ మరింత పెరిగే అవకాశం
వినియోగదారుల్లో ఆందోళన
సీతంపేట/బలిజిపేట:
నిన్నటివరకు తీపి అందించిన పంచదార ఇప్పుడు సామాన్యుడికి చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. పక్షం రోజుల కిందట వరకు కిలో రూ. 45 పలికిన పంచదార ధర తాజాగా కిలో రూ.75కి పెరిగింది. కిలోకు ఒక్కసారిగా రూ.30 పెరగడంతో వ్యాపారవర్గాలే విస్తుపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా అమాంతం పంచదార ధరలు ఒక్కసారిగా ఇలా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంటింటా నిత్యావసరంగా వినియోగించే పంచదార ధరలు సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. వినాయకచవితి, దసరా, దీపావళి వంటి పండగలు సమీస్తున్న నేపథ్యంలో పంచదారకు డిమాండ్ పెరుగుతుంది. కిలో రూ.వంద వరకు వెళ్లినా అశ్చర్య పడాల్సిన అవసరం లేదని వ్యాపారులు చెబుతున్నారు. స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, పానీయాల తయారీలో పంచదార వినియోగం అధికంగా ఉండడంతో వ్యాపారులు ముందుగానే నిల్వ చేసుకుంటున్నారు. చక్కెర ఉత్పత్తి, నిల్వలపై నెలకొన్న ఆందోళన కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. చెరకు లభ్యత, దిగుబడులపై ప్రభావం, ఇథనాల్ ఉత్పత్తికి చెరుకును మళ్లించడం వంటి అంశాలతో దేశీయంగా చక్కెర లభ్యతతపై ఒత్తిడి ఏర్పడింది. దీంతో మిల్లుల వద్ద ధరలు ఒక్కసారిగా పెంచేశారని వ్యాపారులు చెబుతున్నారు.
కేంద్రం కీలక నిర్ణయం..
దేశీయంగా పంచదార లభ్యత తగ్గడంతో పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 10లక్షల మెట్రిక్ టన్నుల ముడి పంచదారను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ నెలాఖరు వరకు ఈ దిగుమతులకు అవకాశం ఉంటుంది. దాదాపు పదేళ్ల తర్వాత భారత్ పంచదార దిగుమతులు వైపు మళ్లడం గమనార్హమని వ్యాపార వేత్తలుచెబుతున్నారు. బ్రెజిల్ నుంచి పంచదార దిగుమతి చేసుకోనున్నారు. కేంద్ర తీసుకున్న నిర్ణయంతో దేశీయ మార్కెట్లో పంచదార లభ్యత పెరిగే అవకాశం ఉంది. దిగుమతి చేసిన ముడి పంచదారను శుద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేయడం ద్వారా సరఫరా పెరిగితే ధరల పెరుగుదలకు కొంతమేర అడ్డుకట్ట పడే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు తెలియజేస్తున్నారు.


