● సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి
రాధానాయుడు
సాలూరు రూరల్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ కూలి మృతిచెందిన తుపాకుల అరుణ్ తేజ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతానని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రాధానాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం ఆమె పెద్దవీధిలో నివాసం ముంటున్న విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నిండు ప్రాణం పోవడానికి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. విద్యార్థులకు కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కల్పించలేని ప్రభుత్వం విద్యావ్యవస్థపై నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందన్నారు.
ఆదర్శ పాఠశాలల్లో అతిథి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
● గంటకు రూ.250 పారితోషికం
పార్వతీపురం రూరల్: విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు, పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీ రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన పీజీటీ, టీజీటీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నామని, అర్హత గల వారు నేరుగా ఆయా సంబంధిత పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపికై న వారికి బోధించిన ప్రతి గంటకు రూ.250 చొప్పున, నెలకు 48 గంటలు మించకుండా గరిష్టంగా రూ.12,000 వరకు పారితోషికం చెల్లిస్తారు. సాలూరు మోడల్ స్కూల్‌లో పీజీటీ(ఎకనామిక్స్), టీజీటీ(సివిక్స్), అలాగే కురుపాం, భామిని స్కూళ్లలో పీజీటీ సివిక్స్, ఇంగ్లీష్, ఎకనామిక్స్ సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నట్లు వెల్ల డించారు. కాగా, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియపై పూర్తి అధికారం జిల్లా విద్యా శాఖాధికారికే ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి హరిజనవీధికి చెందిన ఉత్తరావెల్లి గణపతి బుధవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చీపురుపల్లి నుంచి రాజాం ద్విచక్రవాహనంపై గణపతి వస్తుండగా కొత్తవలస జంక్షన్‌కు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు 108 సహాయంతో రాజాం సామాజిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ మేరకు బాధితుడి భార్య శ్యామల ఫిర్యాదుపై గురువారం కేసు నమోదుచేశామని ఎస్సై సల్మాన్‌బేగ్ తెలిపారు.
వీరఘట్టం: డ్వాక్రా మహిళలకు పారదర్శకంగా రుణాలు మంజూరు చేయడంతో పాటు రికవరీ చేపట్టాలని డీఆర్‌డీఏ పీడీ సీహెచ్ ప్రభావతి అన్నారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో వీఓఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం చలివేంద్రి గ్రామంలో మహిళా రైతులు సాగుచేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించారు. ఆమెతో పాటు ఎంఎంఎస్ అధ్యక్షురాలు కె.లలితకుమారి, డీపీఎం బి.ధర్మారావు, సీ్త్రనిధి ఏజీఎం పి.కామరాజు, ఏపీఎం రాము, తదితరులు పాల్గొన్నారు.
మహిళ ఆత్మహత్య
విజయనగరం టౌన్: స్థానిక ఆర్‌టీసీ కాలనీలో నివాసం ఉంటున్న పాలకొండ మండలంలోని అన్నవరానికి చెందిన కొండేటి జయ (36) బుధవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ కొక్కానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త రామకృష్ణ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ దంపతులకు పెళ్లయి ఏడాదిన్నర అయింది. సంతానం లేదు. మృతురాలి సోదరుడు కొండేటి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలావతి తెలిపారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు.


