బేబీకిట్టు.. | - | Sakshi
Sakshi News home page

బేబీకిట్టు..

Aug 21 2026 3:21 AM | Updated on Aug 21 2026 3:21 AM

–8లో బేబీకిట్టు..

న్యూస్‌రీల్‌

–8లో

ఆచరణలోకి రాని ‘ఎన్టీఆర్‌ బేబీ కిట్లు’ పంపిణీ

వేలాది మంది తల్లుల ఎదురుచూపులు

శుక్రవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026

● గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ప్రభుత్వాస్పత్రిలో నెలకు సగటున 17 నుంచి 26 వరకూ ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ప్రస్తుత తేదీ వరకూ 179 ప్రసవాలు జరిగాయి. ఇందులో ఏ ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తాం అన్న ఎన్టీఆర్‌ బేబీ కిట్టు అందలేదు. ఇక్కడి ఆస్పత్రిలో నాలుగు రోజుల కిందట ప్రసవం అయిన ఒక మహిళకు ఎటువంటి కిట్టు కూడా ఇవ్వలేదని ఆమె బంధువులు చెబుతున్నారు.

........................................................

● ఆర్‌.ఆముదాలవలస మండలానికి చెందిన మహిళ కొద్ది రోజుల కిందట పాలకొండ ప్రభుత్వాస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. డెలివరీ అయి, వెళ్లడం తప్ప.. ఆస్పత్రి సిబ్బంది ఎటువంటి కిట్లు కూడా ఇవ్వలేదని ఆమె చెబుతున్నారు.

సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్‌/ గుమ్మలక్ష్మీపురం:

ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే తల్లుల, పిల్లల సంరక్షణ కోసం ‘ఎన్టీఆర్‌ బేబీ కిట్‌’ అందించనున్నట్లు ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా సుమారు 3.50 లక్షల మందికి కిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టెండర్లు కూడా పూర్తి చేసుకున్నా.. నేటికీ ఏ ఒక్కరికీ ఈ కిట్లు అందించిన దాఖలాలు లేవు. ప్రచార ఆర్భాటంగానే ఈ పథకం మిగిలిపోయింది. రాజకీయంగా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే... ఆయన పేరు పెట్టిన పథకాన్ని చంద్రబాబు నీరుగారుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

13 రకాల వస్తువులు

ఇస్తామని చెప్పి..

శిశు మరణాలను తగ్గించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ‘ఎన్టీఆర్‌ బేబీ కిట్టు’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తల్లికి, బిడ్డకు అవసరమైన మొత్తం 13 రకాల వస్తువులు అందజేస్తామని వెల్లడించింది. బ్యాగు, దోమతెరతో కూడిన పరుపు, ఫోల్డబుల్‌ బెడ్‌, వాటర్‌ ప్రూఫ్‌ షీట్‌, రెండు జతల దుస్తులు, రెండు టవల్స్‌, ఆరు నాప్కిన్లు, రెండు సబ్బులు, సబ్బుపెట్టె, పౌడర్‌, ఆయిల్‌, షాంపూ, బొమ్మ వంటివి ఉంటాయి. ప్రభుత్వాస్పత్రి నుంచి బాలింత డిశ్చార్జి అయ్యే సమయంలో ఈ కిట్టు అందజేయాల్సి ఉంది. రెండేళ్ల పాటు కిట్లు సరఫరా చేయడానికి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా టెండర్లు కూడా పిలిచింది. ఒక్కో కిట్‌ కోసం ఓ సంస్థ రూ.1,989.27 ధరను కోట్‌ చేసింది. అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఈ పథకం పట్టాలు ఎక్కలేదు.

తల్లులకు ఎదురుచూపులే...

జిల్లాలోని ఏడు ప్రాంతీయ ఆస్పత్రుల్లో రోజుకు సుమారు 30 ప్రసవాలు అవుతాయి. ఒక్క జిల్లా ఆస్పత్రిలోనే 10 వరకూ జరుగుతాయి. ఈ లెక్కన ఏడాదిలో వేలాది మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం కోసం వచ్చే వారు పేద, గిరిజన మహిళలే. సుమారు రూ.2 వేల విలువైన బేబీ కిట్టు అందితే ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని ప్రసవం కోసం వచ్చిన తల్లులు అంటున్నారు. ఇదే విషయంపై జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి నాగభూషణం వద్ద ప్రస్తావించగా.. పథకానికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలూ తమకు రాలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement