చెరువుల పరిరక్షణలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

చెరువుల పరిరక్షణలో నిర్లక్ష్యం వద్దు

Aug 21 2026 3:21 AM | Updated on Aug 21 2026 3:21 AM

పార్వతీపురం: జిల్లాలో చెరువుల సరిహద్దుల గుర్తింపు, ఆక్రమణల తొలగింపు, ట్రెంచ్‌ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను హెచ్చరించారు. అధికారులో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో చెరువుల పరిరక్షణ పురోగతిపై సమీక్షించారు. చెరువులను ఆక్రమించిన వారిపై ఆర్‌ఆర్‌ఆర్‌ చట్టం కింద కేసులు నమోదు చేసి క్రిమినల్‌ చర్యలతో పాటు భారీ జరీమానాలు విధిస్తామని తెలిపారు. చెరువు గట్ల వెంట ట్రెంచ్‌ పనులు పూర్తి చేసి, గట్లు స్థిరత్వానికి మొక్కలు నాటాలని ఆదేశించారు. సర్వే, పనుల ప్రగతి, కూలీల సంఖ్య, మస్తర్‌ రోల్స్‌ వివరాలను గూగుల్‌ షీట్‌లో నమోదు చేయాలని సూచించారు. చెరువుల ఆక్రమణలు పూర్తిగా తొలగించేవరకు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఆర్‌.వైశాలి, ఆర్డీఓ కె.మాధురి, డ్వామా పీడీ కె. రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ ల్యాడ్స్‌ పనులు గడువులోగా

పూర్తి చేయాలి

ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలాల్లో సోలార్‌ స్ట్రీట్‌లైట్లు, ఆర్వో ప్లాంట్‌లు, బస్‌సెల్టర్లు, సీసీ డ్రైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల పనులను వేగవంతం చేయాలని సూచించారు.

దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

కొత్తవలస: సౌత్‌ ఏసియా ఎల్‌పీజీ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో మంగళపాలెం గ్రామ సమీపంలోని గురుదేవా చారిటిబుల్‌ ట్రస్టు గురువారం 350 మంది దివ్యాంగులకు కృత్రిమ ఆవయవాలు, ఉపకరణాలను తహసీల్దార్‌ ఎస్‌.రామలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ట్రైసైకిల్స్‌, పోలియో కాలిపవర్స్‌, చెవిటి మిషన్‌లు, వీల్‌చైర్స్‌, వాకర్స్‌ స్టిక్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ దివ్యాంగుల సేవలో ట్రస్టు పరితపించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్‌ రాపర్తి జగదీష్‌బాబు, సభ్యులు పాల్గొన్నారు.

రెల్లి భూ ఆక్రమణలపై చర్యలకు ఉపక్రమణ

వీఆర్వోకు ఉద్వాసన

కొత్తవలస: మండలంలోని రెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల దురాక్రమణపై అధికార యంత్రాంగం స్పందించింది. చర్యలకు ఉపక్రమించింది. కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్న తీరుపై ‘పెచ్చు‘రెల్లి’తున్న ఆక్రమణలు’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన వార్తకు మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. ముందుగా గ్రామంలో జరిగిన భూ ఆక్రమణలను గుర్తించి నివారించడంలో గ్రామ రెవిన్యూ అధికారి ఎస్‌.సుదీర్‌ విఫలమయ్యారన్న కారణంతో విధుల నుంచి తప్పించినట్టు తహసీల్దార్‌ ఎస్‌.రామలక్ష్మి తెలిపారు. ఆయన స్థానంలో దెందేరు వీఆర్వోగా పనిచేస్తున్న జి.గోవింద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించామన్నారు. సర్వే నంబర్‌ 146–1లో ఐదు ఎకరాల 16 సెంట్ల ఆక్రమిత భూమికి వెళ్లేందుకు అక్రమంగా నిర్మించిన కల్వర్టుకు అడ్డంగా ఆర్‌ఐ షణ్ముఖరావు, మండల సర్వేయర్‌ గంగాధర్‌ల సమక్షంలో జేసీబీతో పెద్ద కందకాన్ని తవ్వించారు. సంబంధిత భూమిలోకి ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. సర్వే నంబర్‌ 21లో 11, 13, 15 సబ్‌ డివిజన్‌లలోని భూమి చుట్టుపక్కల జిరాయితీ భూములు ఉన్నాయని, మధ్యలో ప్రభుత్వ భూమి ఉన్నట్టు తహసీల్దార్‌ తెలిపారు. ఆక్రమణలను ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.

విలేకరిపై దాడిని ఖండించిన జెడ్పీ చైర్మన్‌

వియనగరం రూరల్‌: పూసపాటిరేగ మండలానికి చెందిన ఓ దినపత్రిక విలేకరి గోవింద్‌పై జరిగిన దాడిని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఖండించారు. జిల్లాలో ఇటువంటి విషసంస్కృతి హేయమైన చర్యగా అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement