విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం జాప్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో వైద్యవిద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారుతోంది. వసతిగృహ విద్యార్థుల సమస్యలను కనీసం పట్టించుకోవడంలేదంటూ విద్యార్థులు నిరసన గళం వినిపించారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐస్‌ఫ్యాక్టరీ కూడలి నుంచి బాలాజీ కూడలి వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి ఎన్.నాగభూషణం మాట్లాడుతూ, ఎన్‌టీఏను రద్దు చేసి పారదర్మక పరీక్షా విధానం తీసుకురావాలని, రాష్ట్ర విభజన హామీల మేరకు 11 కేంద్ర విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. – విజయనగరం గంటస్తంభం


