అంగీకార పత్రం ఉంటేనే పిల్లలు ఇంటికి.. | - | Sakshi
Sakshi News home page

అంగీకార పత్రం ఉంటేనే పిల్లలు ఇంటికి..

Jul 12 2026 12:53 AM | Updated on Jul 12 2026 12:53 AM

సీఆర్‌టీలకు రెన్యువల్‌

సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని పార్వతీపురం గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎ.విజయశాంతి తెలిపారు. పిల్లలను తల్లిదండ్రులు ఎప్పుడైనా తీసుకువెళ్లాలంటే ఐటీడీఏ పీవో ద్వారా ఒక సర్టిఫికెట్‌ ఇస్తామని చెప్పారు. దానికి తల్లిదండ్రులు డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాతే ఇళ్లకు పంపుతామని వివరించారు. జీపీఎస్‌ పాఠశాలలను ఎక్కడా మూసివేసే ప్రసక్తి లేదని వెల్లడించారు. ‘సాక్షి’ ముఖాముఖిలో ఆమె పలు అంశాలను వివరించారు. ఆ వివరాలు...

సులువుగా అర్థమయ్యేలా వీడియో బోధన

సబ్జెక్టులకు సంబంధించి పిల్లలు సులువుగా అర్థం చేసుకునేలా యూట్యూబ్‌ వంటి మాధ్యమాల ద్వారా వీడియో లింకుల నుంచి ప్రతి రోజూ గంట పాటు ప్రత్యేక తరగతులు చేపడుతున్నాం. ఇప్పటికే 9, 10వ తరగతులకు సంబంధించి యాక్టివిటీలు ప్రారంభమయ్యాయి. 3 నుంచి 8వ తరగతి వరకు సిలబస్‌ మారడం వల్ల ఆ మేరకు బోధన వీడియోలను సిద్ధం చేస్తున్నాం. ఐటీడీఏ పరిధిలోని అన్ని ఆశ్రమ పాఠశాలల్లోనూ ఈ తరహా బోధన అమలు చేయనున్నాం.

జీపీఎస్‌ పాఠశాలలు మూతపడవు

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఇది వరకు 47 ఆశ్రమ పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు 46 అయ్యాయి. టొంపలపాడు పాఠశాలను నీలకంఠాపురం బాలుర పాఠశాలలో విలీనం చేశాం. రావికోన పాఠశాలలో 8, 9, 10 తరగతులు కూడా విలీనం అవుతాయి. తల్లిదండ్రుల ఇష్టానుసారం పిల్లలను మిగతా పాఠశాలలకు పంపుతాం. 350 జీపీఎస్‌ పాఠశాలల్లో 329 పాఠశాలలు పూర్తి స్థాయి విద్యార్థులతో నడుస్తున్నాయి. మిగతా 21 పాఠశాలల్లో పూర్తిగా పిల్లలు లేరు. కొన్ని చోట్ల పాఠశాలలను తరలించాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల ఇతర ప్రాంతాల్లోని విద్యార్థులను ఇక్కడకు తెచ్చి, వినియోగంలోకి తేనున్నాం. జీపీఎస్‌ పాఠశాలలను మూసివేసే ఉద్దేశం లేదు.

లక్ష్యానికి మించి విద్యార్థుల చేరిక

మొత్తం 46 పాఠశాలల్లో 18,854 మంది విద్యార్థులున్నారు. వాస్తవానికి 14,600 మంది విద్యార్థుల చేరిక లక్ష్యంగా పెట్టుకున్నాం. పూర్తి స్థాయిలో పిల్లలు చేరారు. ఎనిమిది పీఎంహెచ్‌ల్లో ఇంటర్‌, డిగ్రీ, డిప్లమోలకు సంబంధించి 2,400 మంది వరకు ఉన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేస్తున్నాం. హెచ్‌ఎంలు తరచూ వారితో మాట్లాడతారు. రోజువారీ విద్యార్థుల యాక్టివిటీస్‌ను అందులో పెడతాం. పిల్లలకు అందించే మెనూ చార్జీలు పెరగనున్నాయి. కుక్‌, శానిటరీ వంటి విభాగాల్లో క్లాస్‌–4 ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది. దీనిపై ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది.

286 మంది సీఆర్‌టీలకు రెన్యువల్‌ ఉత్తర్వులు వచ్చాయి. 181 మంది సవర భాషా పండిట్లకు కూడా రెన్యువల్‌ అవుతోంది. ఈ ఏడాది నుంచి 26 మంది కు.వి.(కొఠియా వంటి ప్రాంతాల్లో ఉండే జాతాపు వారి కోసం) పండిట్లు విధుల్లో చేరారు. –ఎ.విజయశాంతి, డీడీ

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. రానున్న మూడు నెలలో బ్యాటరీ పరీక్ష పిల్లలకు చేస్తున్నాం. పరుగు, ఇతరత్రా ఆసక్తి గల ఆటలను పీడీ, పీఈటీల సమక్షంలో వారికి ఆడిస్తాం. దీని ద్వారా వారి ఆరోగ్యం, శారీరక సామర్థ్యంపై ఒక అంచనాకు రావచ్చు.

విద్యా సంస్థలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. అక్కడ పరిస్థితిని పీవో, కలెక్టర్‌ దృష్టిలో పెడుతున్నాం. ఫీవర్‌ స్క్రీనింగు పరీక్షలు నిర్వహిస్తున్నాం. కొన్నిచోట్ల సీజనల్‌ జ్వరాలు వెలుగు చూస్తున్నాయి. అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నాం.

పిల్లలకు సురక్షిత తాగునీటిని అందించేలా ప్రతిచోటా ఆర్వో ప్లాంట్లు అమర్చాం. అవసరమైన వెంటనే మరమ్మతులు చేపడుతున్నాం. పాఠశాలకు రెండు చొప్పున వాటర్‌ టెస్టింగు కిట్లు కూడా అందించాం. నీటిని ఎప్పటికప్పుడు పరీక్షించవచ్చు.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా నిర్ణయం

గిరిజన పాఠశాలల్లో పర్యవేక్షణ పెంచుతున్నాం

ఐటీడీఏ డీడీ విజయశాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement