● వాటాల్లో తేడాలా? పంపకాల్లో పేచీలా? ● వెనకుండి నడిపించిన ఎంపీపీ ● మన్యం జిల్లాలో వైరల్‌ అవుతున్న వీడియోలు | - | Sakshi
Sakshi News home page

● వాటాల్లో తేడాలా? పంపకాల్లో పేచీలా? ● వెనకుండి నడిపించిన ఎంపీపీ ● మన్యం జిల్లాలో వైరల్‌ అవుతున్న వీడియోలు

Jun 10 2026 12:25 AM | Updated on Jun 10 2026 12:25 AM

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

ప్రభుత్వ పాలనలో అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు చక్రాల్లా? జోడెడ్ల మాదిరి సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రగతి రధాన్ని నడిపించాలి. కానీ మన్యం జిల్లాలోని ఓ మండలంలో మండల స్థాయిలోని ఓ అధికారికి, సదరు ప్రజాప్రతినిధికి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ ఏకంగా మండల పరిషత్‌ కార్యాలయంలోనే రౌడీల మాదిరి బూతులు తిట్టుకుని చిల్లర మనుషుల మాదిరిగా కొట్టుకునే వరకు వచ్చింది పరిస్థితి. దీని వెనుక వాటాల పంపిణీలో తేడాలు వచ్చాయా? ఇద్దరి ఇగోలు గట్టిగా ఢీకొన్నాయా తెలియదు కానీ దరువులు మాత్రం పడ్డాయి. అక్కడే ఉన్న కొందరు ఔత్సాహికులు దీన్ని ఉత్సుకతతో చూడడమే కాకుండా వారి మధ్య సంవాదాన్ని వీడియోలు కూడా తీశారు. దీంతో అవి కాస్తా వీధికెక్కాయి.

ఎంపీడీవో వస్తూనే నిధులపై కన్ను

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పని చేస్తూ సస్పెండ్‌ అయి చాన్నాళ్లుగా పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న శశిభూషణరావు మూడు నెలల క్రితం జియ్యమ్మవలస ఎంపీడీవోగా వచ్చారు. వస్తూనే ఎంపీడీవో ఖాతాలో ఎంత డబ్బు ఉంది.. దాని లెక్కలేమిటి ? తేల్చేయాలన్న ఆలోచనల్లో పడ్డారు. ఈ క్రమంలోనే వివిధ పథకాలు, పనులకు సంబంధించి తన ఖాతాలో ఉన్న ప్రభుత్వ నిధులు దాదాపు రూ.10 లక్షలను మే 5 నుంచి 21 తేదీ మధ్య డ్రా చేసి సొంతానికి వాడుకున్నారు. ఎందుకు నిధులు తీశారు.. దేనికి ఖర్చు చేశారన్న దానికి సంబంధించి ఆయన ఎవరికీ, కనీసం మండల పరిషత్‌కు కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా చెక్కులతో నిధులు వాడేశారు. ఈ అవినీతికి సూపరింటెండెంట్‌ కొండగొర్రె రామారావు, ఆఫీస్‌ సబార్డినేట్‌ చొక్కాపు శ్రీనివాసరావు సైతం సహకరించినట్లు తెలుస్తోంది. ఈ డబ్బు డ్రా చేసిన అంశం తనకు తెలియలేదన్న కోపమో, అందులో తనకు వాటా రాలేదన్న ఆగ్రహమో తెలియదు కానీ మండల పరిషత్‌ అధ్యక్షుడు బొంగు సురేష్‌ ఈ అంశం మీద ఎంపీడీవోను ప్రశ్నించారు. దీనికి ఆయన సరైన సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా నీకెందుకు చెప్పాలి.. ఇదంతా నా ఇష్టం అన్నట్లుగా మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఆఫీస్‌ సబార్డినేట్‌ శ్రీనివాస్‌ కూడా ఇరుక్కోవడంతో ఆయన్ను రెచ్చగొట్టి ఆయనతో ఎంపీడీవోను ఏకంగా ఆఫీసులో కొట్టించినట్లు తెలిసింది. అందులో తనకు వాటా రాకపోగా అవినీతిలో మాత్రమే తనకు భాగం దక్కడాన్ని సహించలేకపోయిన శ్రీనివాస్‌ ఏకంగా ఎంపీడీవోపై దాడి చేసారని తెలుస్తోంది. అయితే ఈయన వెనుక ఎంపీపీ సురేష్‌ ఉన్నారని, ఆయన ప్రోద్బలంతోనే శ్రీనివాస్‌ ఇలా దాడి చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం మొత్తం గలాటా నెలకొనగా ఈ తంతు చూస్తున్న వాళ్లు వాటికి సంబంధించిన వీడియోలు సైతం రికార్డ్‌ చేయడంతో ఈ వ్యవహారం కాస్త రచ్చకెక్కింది. సురేష్‌ అక్కడితో ఆగకుండా నిధుల దుర్వినియోగం మీద ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టివి.తిరుపతిరావు కేసు నమోదు చేశారు. మరోవైపు నిధులు డ్రా చేసిన ఎంపీడీవో రెండ్రోజులుగా పరారీలో ఉన్నారు. ఫోన్‌ సైతం స్విచ్ఛాఫ్‌ వస్తోందని తెలుస్తోంది.

ఈ అంశం ఉమ్మడి విజయనగరం జెడ్పీ సీఈవో వరకు చేరడంతో శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఎంపీడీవో, ఎంపీపీల మధ్య రగడ ఏమిటి? కొట్లాట ఎందుకు.. డబ్బుల పంపిణీల తేడాలొచ్చి తన్నుకున్నారా? ఆ వ్యవహారం వెనుక ఏం జరిగిందన్న అంశాలను సీఈవో దర్యాప్తు చేసినట్లు తెలిసింది.

వాటాల్లో తేడాలే తన్నులాటకు

దారి తీసిందా?

ఇదిలా ఉండగా ఎంపీపీ, ఎంపీడీవోల మధ్య డబ్బుల పంపకాల్లో వచ్చిన పొరపొచ్చాలు ఏకంగా కొట్లాటకు దారి తీసిందని స్థానికంగా విషయం తెలిసిన ఉద్యోగులు అంటున్నారు. మొత్తం పది లక్షలు ఎంపీడీవో ఒక్కరే మింగేయడంతో ఎంపీపీకి ఆగ్రహం వచ్చి అప్పటికే కేసులో ఇరుక్కున్న ఆఫీస్‌ సబార్డినేట్‌ శ్రీనివాస్‌ను రెచ్చగొట్టి ఎంపీడీవో మీద దాడికి పురిగొల్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మన్యం ఎంపీడీవో ఆఫీసులో ‘పెది’్ద తరహా కుస్తీ సీన్లు జరుగుతున్నాయని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement