రైతుబజార్లలో పైనాపిల్‌ విక్రయానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

రైతుబజార్లలో పైనాపిల్‌ విక్రయానికి చర్యలు

Jun 10 2026 12:25 AM | Updated on Jun 10 2026 12:25 AM

సీతంపేట: 82 రైతు బజార్లలో పైనాపిల్‌ విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నట్టు పాలకొండ సబ్‌ కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌ స్వప్నిల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన రైతులు పండించిన నాణ్యమైన పైనాపిల్‌ పండ్లకు సరైన గిట్టుబాటు ధర లభించేలా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ పరిసరాల్లో రైతు బజార్లలో రైతులు విక్రయించుకోవడానికి అవకాశం లభించనున్నట్టు తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు పాల్గొని అమ్మకాలు చేపట్టవచ్చన్నారు. ఈ మార్కెటింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి ఆసక్తి గల గిరిజన రైతులు, ఎఫ్‌పీవో, ఎస్‌హెచ్‌జీ సంఘాలు తమ వివరాలతో ఐటీడీఏ సీతంపేట కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

23 నుంచి పైడిమాంబ ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు చదురుగుడి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి 25 వరకూ మూడు రోజుల పాటూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌, ఆలయ ఈఓ కె.శిరీషా తెలిపారు. స్థానిక చదురుగుడి ప్రాంగణంలో విజయనగరం ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు ఆధ్వర్యంలో ఉత్సవాల కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది నవంబర్‌ 10వ తేదీన సోమవారం అమ్మవారి చదురుగుడి విస్తరణ పనుల్లో భాగంగా కళాప్రకర్షణ చేపట్టి, పక్కనే బాలాలయం నిర్మించామని, అప్పటి నుంచి నేటి వరకు బాలాలయంలోనే అమ్మవారి దర్శనం కల్పించామన్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే చదురుగుడి విస్తరణ పనులు శరవేగంగా చేపట్టగలిగామన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ రూ.కోటీ 80లక్షల వ్యయంతో ఆలయ అభివృద్ధిపనులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకిచ్చిన హామీలు అమలు చేయాలి

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు

విజయనగరం గంటస్తంభం: విద్యార్థులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు డిమాండ్‌ చేశారు. కర్నూలు నగరంలో జూలై 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్న ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయం అమర్‌ భవన్‌లో శిక్షణా తరగతుల కరపత్రాలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు ఇబ్బందిగా మారిన జీవో నెం.77ను రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి విద్యా దోపిడిని అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.నాగభూషణం, ఉపాధ్యక్షుడు సుమన్‌, సహాయ కార్యదర్మి గౌరీశంకర్‌, పట్టణ నాయకులు చరణ్‌, గణేష్‌ పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి వినతి

విజయనగరం క్రైమ్‌: అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సాయిరాజేష్‌ను విజయనగరం ఉమ్మడి జిల్లా అగ్నిమాపక శాఖ ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు విజయనగరం అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఇటీవల జిల్లాలో పునః ప్రారంభించిన సిబ్బంది ముఖ హాజరు వల్ల తలెత్తే సమస్యలను డీఎఫ్‌ఓ దృష్టికి తీసుకువెళ్లినట్టు అగ్నిమాపక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అధికారి రమేష్‌ తెలిపారు. తమ శాఖలో సిబ్బంది కొరత వల్ల 24 గంటలూ విధుల్లో ఉంటున్నామని, అగ్ని ప్రమాదాలు రెస్క్యూ, అవుట్‌ డ్యూటీలు, బందోబస్తు, వీఐపీ కాన్వాయ్‌ ఇతర విధుల నిమిత్తం బయటకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement