● సీజ్ చేసిన ఇసుక తరలింపు
● అధికారుల ఆగ్రహం
● నడిమికెల్లలో యథేచ్ఛగా ఇసుక దందా
వీరఘట్టం: మండలంలోని నడిమికెల్లలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. గత నెల 23న గ్రామంలో నిల్వ చేసిన ఇసుక కుప్పలను అధికారులు సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన ఇసుకను రాత్రి పూట తరలించుకుపోతూ అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయం రెవెన్యూ, పోలీసులకు మంగళవారం తెలియడంతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గ్రామంలో ఉన్న ట్రాక్టర్లు, జేసీబీల వివరాలు కావాలని తహసీల్దార్ రాజేశ్వరరావు తమ సిబ్బందికి సూచించారు. అనంతరం ఎస్.ఐ షణ్ముఖరావుతో మాట్లాడారు. ఇసుక దందాకు పాల్పడుతున్న వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సూచించారు.
నడిమికెల్లలో ఏం జరుగుతోంది...
మండలంలోని నడిమికెల్ల గ్రామం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. గ్రామానికి సమీపంలో ఉన్న నాగావళి నది నుంచి ఇసుకను అక్రమంగా తీసుకువచ్చి తమకు అనుకూలంగా ఉన్న చాలా చోట్ల డంపింగ్ చేస్తున్నారు. ఇలా డంపింగ్ చేసిన ఇసుకను లారీలు, ట్రాక్టర్లతో రాత్రి పూట ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దర్జాగా అక్రమ వ్యాపారం చేస్తున్నారు. గ్రామానికి చెందిన కొంత మంది ఈ ఇసుక దందా చేస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు.
మైనింగ్ అధికారులు ఎక్కడున్నారు...
నడిమికెల్లలో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. బహిరంగంగానే లారీలు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తూ కొంత మంది అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా మైనింగ్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా మైనింగ్ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
16 మందిపై బైండోవర్ కేసులు
అనుమతులు లేకుండా ఆక్రమంగా ఇసుక పెరుగుతున్నారనే ఆరోపణలు ఉన్న నడిమికెల్ల గ్రామానికి చెందిన 16 మందిపై మంగళవారం సాయంత్రం తహసీల్దార్ రాజేశ్వరరావు సమక్షంలో బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ షణ్ముఖరావు తెలిపారు.


