పార్వతీపురం రూరల్: తల్లికి ఏమైందో ఆ లేగ దూడకు తెలియదు.. రక్తపు మడుగులో చలనం లేకుండా పడి ఉన్న తల్లిని చూసి లేగదూడ తల్ల డిల్లిపోయింది. ఎవరైనా వచ్చి తన తల్లికి ప్రాణం పోస్తారేమోనని రోడ్డు వైపు దీనంగా చూసిన ఆ మూగజీవి ఆవేదన పాదచారులను సైతం కంటతడి పెట్టించింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పరిధిలోని రాయగడ రహదారిపై ఈ హృదయ విదారక ఘటన మంగళవారం జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం రోడ్డుపై ఉన్న ఆవును బలంగా ఢీకొట్టి, కనీసం ఆపకుండా అక్కడి నుంచి పరారైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ గోమాత సుమారు మూడు గంటల పాటు ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపైనే నరకయాతన అనుభవించింది. తల్లి ఎంతకీ కదలకపోవడంతో ఆవేదనకు గురైన దూడ.. పక్కనే కాపలాగా ఉంటూ తన మూతితో పదేపదే తట్టి లేపేందుకు ప్రయత్నించింది. కళ్లలో నీళ్లు నింపుకుని సాయం కోసం అటుగా వెళ్లే వారి వైపు ఆశగా చూసింది. గుండె బరువెక్కే ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, పాదచారులు తీవ్రంగా చలించిపోయారు. ప్రమాదానికి కారకుడైన వాహనదారు కర్కశత్వంపై మండిపడుతూనే.. లేగదూడ ఆవేదనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.


