స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో గాదెలవలస ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో గాదెలవలస ఉద్యోగి మృతి

Jun 10 2026 12:25 AM | Updated on Jun 10 2026 12:25 AM

సీతానగరం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం, గాదెలవలస గ్రామానికి చెందిన గొట్టాపు త్రినాఽథ్‌ (50) మృతి చెందడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. మృతుడు త్రినాథ్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు పవన్‌ విజయవాడలో బ్యాంక్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. రెండవ కుమారుడు భరత్‌ చైన్నెలోని కాంగో కంపెనీలో సాఫ్టవేర్‌ ఉద్యోగం చేస్తున్నాడని కుటుంబసభ్యులు తెలియ జేశారు. సామాన్యరైతుకుటుంబానికి చెందిన త్రినాథ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగం సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న సమయంలో ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కు పోయిందని బోరున విలపిస్తున్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

పాలకొండ రూరల్‌: మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన అల్లు సీతారాం(46) శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. దీనిపై పోలీసులు అందించిన వివరాల మేరకు తీవ్ర ఆనారోగ్యం కారణంగా పది రోజుల క్రితం సీతారాం తన ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అప్పట్లో ఆయనను కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా వైద్య సేవలు పొందుతూ మరణించినట్లు ఎస్సై డోల వెంకన్న తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. మృతుడికి భార్య భవాని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్యా పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు.

విద్యుత్‌ షాక్‌తో ఆవు..

తెర్లాం: మండలంలోని లింగాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం విద్యుత్‌ షాక్‌కు గురై పాడిఆవు మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు కునుకు వెంకటరావు మేత కోసం గ్రామానికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలానికి ఆవును తోలుకుని వెళ్లాడు. అదే స్థలంలో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్లకు ఆవు తగలడంతో వెంటనే విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఎన్నోఏళ్లుగా కష్టపడి పెంచుకున్న ఆవు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందడంతో రైతు వెంకటరావు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయంపై గ్రామ రెవెన్యూ అధికారి తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. మండల ట్రాన్స్‌కో ఏఈ తెంటు శ్రీనివాసరావు, మండల పశువైద్యాధికారి డాక్టర్‌ జె.నరేంద్రకుమార్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతి చెందిన ఆవును పరిశీలించారు.

ఏడుగురు గంజాయి

నిందితుల అరెస్ట్‌

విజయనగరం క్రైమ్‌: రెండున్నర కిలోల గంజాయితో ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశామని విజయనగరం రూరల్‌ ఎస్సై అశోక్‌ మంగళవారం తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన ఎల్‌.కల్యాణ్‌ అరకు నుంచి మూడు కిలోల గంజాయిని తెచ్చి నాగరాజు అనే వ్యక్తికి అమ్మినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ మేరకు ఇద్దరినీ పట్టుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయగా ఎం,సతీష్‌ వర్మ(24), ఎం.సాయి వర్మ(22) వై. తిరుపతి దాలయ్య (33), కె.గణేష్‌ (23),పి.అశోక్‌ (22) పట్టుబడ్డారన్నారు. ఇందులో కల్యాణ్‌ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాడు కాగా విజయనగరంలోని అలకానంద కాలనీలో ఉంటూ స్నేహితులకు అరకు నుంచి తెచ్చిన గంజాయిని కొండకరకాం వద్ద అమ్ముతున్నాడన్న సమాచారంతో అదుపులో తీసుకుని అరెస్ట్‌ చేశామని ఎస్సై అశోక్‌ తెలిపారు. వారి దగ్గర నుంచి సుమారు రెండున్నర కేజీల గంజాయి, నాలుగు బైక్‌ లు, ఏడు సెల్‌ ఫోన్‌ లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై అశోక్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement