విజయనగరం అర్బన్: ప్రత్యేక అవసరాలు (దివ్యాంగులు)గల విద్యార్థులను అత్యంత శ్రద్ధతో చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మొత్తానిదని కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పి.అదితి గజపతిరాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్ధులకు అవసరమైన విద్య, వైద్య, పునరావాస సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి వారి అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. శారీరక పరిమితులు ప్రతిభకు అడ్డంకి కాదని, ప్రతి చిన్నారి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. డీఈఓ, సమగ్ర శిక్ష ఏపీసీ యూ.మాణిక్యం నాయుడు మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాల్లో భవిత కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం–2016 ప్రకారం 1 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వివిధ రకాల వైకల్యాలున్న పిల్ల లకు ప్రత్యేక విద్య అందిస్తున్నట్లు చెప్పారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రవాణా భత్యం, సహాయక భత్యం, ఇంటి వద్ద విద్యాభత్యం, దివ్యాంగ బాలికల ఉపకార వేతనాలు డీబీటీ విధానంలో వేలాది మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.
518 సహాయ పరికరాల పంపిణీ
అనంతరం జిల్లాలోని 474 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మొత్తం 518 సహాయక పరికరాలను పంపిణీ చేశారు. వాటిలో 56 డిజిటల్ హియరింగ్ ఎయిడ్లు, 41 కమోడ్ వీల్ చైర్లు, 53 వీల్ చైర్లు, 337 టీఎల్‌ఎం కిట్లు, 17 క్రచ్‌లు, 12 ట్రైసైకిళ్లు, ఒక స్క్రీన్ రీడర్ సదుపాయం కూడిన స్మార్ట్‌ఫోన్, ఒక బ్రెయిలీ కిట్ ఉన్నాయి. కార్యక్రమం అనంతరం కలెక్టర్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు జి.చంద్రిక, సమగ్ర శిక్ష అకౌంట్స్ అధికారి ఆర్‌ఏఎస్‌కుమార్, కో ఆర్డినేటర్లు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


