మహిళా సాధికారత ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారత ఎక్కడ?

Jun 10 2026 12:25 AM | Updated on Jun 10 2026 12:25 AM

ఎమ్మెల్సీ విక్రాంత్‌

రాజాం: రాష్ట్రంలో మహిళా సాధికారత కనిపించడంలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం రాజాంలో ఓపైవేట్‌ కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల నాలుగు పార్లమెంట్‌ స్థానాలు కూటమికి భర్తీచేసే అవకాశం వస్తే నాలుగింటిలో ఒక్కటి కూడా మహిళలకు కేటాయించలేదని ఆరోపించారు. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 50 శాతం దాటి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. గ్రామ వలంటీర్లలో 53 శాతం, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం, స్థానిక సంస్థల్లో 50 శాతం అమలుచేశారని గుర్తుచేశారు. అప్పట్లో మంత్రివర్గంలో ఐదుగురికి మించి మహిళలు మంత్రులుగా ఉన్నారన్నారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల్లో 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మహిళలు కాగా, 7 శాతంగా నమోదైందని వివరించారు. కూటమి క్యాబినెట్‌లో కేవలం ఇద్దరు మాత్రమే మంత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు రాజ్యసభ సీట్లలో ఒకటి నుంచి రెండు సీట్లు మహిళలకు ఇస్తే ఎంతో బాగుండేదని, మహిళల అభివృద్ధిని చంద్రబాబునాయుడు ఓర్వలేకనే సీట్లు కేటాయించలేదని ఆరోపించారు.

‘తోటపల్లి’ పునః ప్రారంభించక పోతే

రైతులకు తీవ్రనష్టం

వంగర: తోటపల్లి ఆధునికీకరణ పనులు పునః ప్రారంభించకపోతే ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ అన్నారు. మంగళవారం మండల పరిధి మగ్గూరు గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గడిచిన రెండేళ్లుగా తోటపల్లి ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో వంగర మండల రైతాంగం సాగునీటికి ఇబ్బందులు పడతున్నారన్నారు. కుడి ప్రధాన కాలువ ఎగువ భాగంలో కాలువ మరమ్మత్తులకు గురైందని, గడిచిన రెండేళ్లుగా సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో అన్నదాతలు సాగునీటికి అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. రైతు సేవా కేంద్రాల ద్వారా సకాలంలో రైతులకు ఎరువులు విత్తనాలు అందడంలేదని, రైతుల పట్ల ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని హితవు పలికారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు పుష్కలంగా అందించారని గుర్తు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, షూస్‌ పాఠశాలలు తెరిచే నాటికి అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ ముఖర్జీ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కరణం సుదర్శనరావు, మండల పార్టీ యూత్‌ అధ్యక్షుడు బొక్కేల వెంకటప్పలనాయుడు, పార్టి నాయకులు గేదెల రామకృష్ణ, పోలిరెడ్డి రమేష్‌, ఏగిరి ముత్యాలరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement