● అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు
విజయనగరం ఫోర్ట్: నేలల్లో కర్బన శాతాన్ని పెంచడానికి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ సీహెచ్. ముకుందరావు అన్నారు. ఈ మేరకు గాజులరేగ వ్యవసాయ పరిశోధన స్థానంలో గిరిజన రైతులకు గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా వ్యవసాయ ఉప కరణాలు పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఎంతో ఉందన్నారు. జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువుల వినియోగాన్ని పెంచాలని కోరారు. సిఫార్సు మేరకు మాత్రమే ఎరువులు వేయాలని సూచించారు. ప్రకృతి సాగు పద్ధతిలో వ్యవసాయం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అఖిల భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ప్రతినిధి కె. శ్రీనివాసబాబు, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి. టీఎస్‌ఎస్‌కే పాత్రో, జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు, ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, శాస్త్రవేత్తలు డాక్టర్ కె.తేజేశ్వరావు, డాక్టర్ ఎంవీవీ శ్రీనివాస రావు, డాక్టర్ ఎన్.అనూరాధ, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.


