ఇసుక నాటకంలో అడ్డంగా దొరికారు.. | - | Sakshi
Sakshi News home page

ఇసుక నాటకంలో అడ్డంగా దొరికారు..

Jun 9 2026 8:40 AM | Updated on Jun 9 2026 8:40 AM

ఇసుక నాటకంలో అడ్డంగా దొరికారు..

మంత్రి ఎదుటే బండారం బట్టబయలు కలెక్టర్‌ను ఇరికించబోయి.. ఇరకాటంలోకి! సమస్యలు సృష్టిస్తూ.. మళ్లీ వారే ఫిర్యాదులు ఇస్తున్న తెలుగు తమ్ముళ్లు

సాక్షి, పార్వతీపురం మన్యం:

కొమరాడ మండలం కోరిశీల గ్రామం సర్వే నంబర్‌ 54–2ఏ పరిధిలోని నాగావళి నదీ తీరం నుంచి ఇసుక తవ్వుకోవడానికి గత నెల 20న నిబంధనల ప్రకారం మైనింగ్‌ కంపెనీకి అనుమతులు ఇచ్చారు. గత నెల 21న కలెక్టరేట్‌ వద్ద కొంతమంది టీడీపీ వారు.. గిరిజనులను తీసుకొచ్చి నిరసన చేయించారు. ఆ భూమిపై ఏళ్ల నాటి నుంచి ఉన్నామని.. అధికారులు కుమ్మకై ్క ఇసుక రీచ్‌కు అనుమతులు ఇచ్చారని వారి ఆరోపణ. ఇది వరకే కలెక్టర్‌కు, జేసీకి, మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీనిపై ఒక్క రోజులోనే కోర్టుకు వెళ్లి ఆర్డర్‌ తెచ్చుకున్నారు. అంతా ఆగమేఘాల మీద జరిగిపోయింది. కోర్టు జోక్యంతో అక్కడ రీచ్‌కు బ్రేక్‌ పడింది. ఇదే మండలం కూనేరు–రామభద్రపురం వద్ద మరో రీచ్‌కు

అధికారిక అనుమతి ఇచ్చారు.

సీన్‌ కట్‌ చేస్తే.. అప్పట్లో నిరసనను ముందుండి నడిపించిన కొంతమంది సోమవారం రాష్ట్ర మంత్రి సంధ్యారాణి హాజరైన కలెక్టర్‌ కార్యాలయ పీజీఆర్‌ఎస్‌కు వచ్చి మరోసారి వినతి పత్రం అందజేశారు. అవే ఆరోపణలు మళ్లీ చేశారు. తహసీల్దార్‌, మైనింగ్‌ అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, న్యాయం జరగడం లేదని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? అని మంత్రి అడిగితే.. అవునని వారు బదులిచ్చారు. వెంటనే మంత్రి వారందరినీ పిలిపించారు. కురుపాం ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడారు. ఎవరికీ ఫిర్యాదు అందలేదని అటు నుంచి సమాధానం. వెంటనే సదరు వ్యక్తులు సర్దుకుని.. తాము నేరుగా ఎవరినీ కలవలేదని చెప్పుకొచ్చారు. స్పీడ్‌ పోస్టులో పంపించామని చెప్పారు. దీంతో మంత్రి, కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ స్థానానికి వెళ్లి చెప్పుకున్నారు గానీ, జిల్లా అధికారుల వద్దకు వచ్చి అభ్యంతరం చెప్పలేకపోయారా? అని ప్రశ్నించారు. వారు ఫిర్యాదు చేసిన వీడియోలు, ఫొటోలు కూడా ఇక్కడివి కావని.. ఎవరో తప్పుడు ఆరోపణలతో వెంట నడిపిస్తున్నారని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ‘మీ వెనుక వైసీపీ వారు ఉన్నారా? ఎందుకు ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు’ అని మంత్రి ప్రశ్నిస్తే.. తాము ఆది నుంచి టీడీపీ వారమని ఓ వ్యక్తి బదులిచ్చాడు. ఆ వ్యక్తి ఫోన్‌ వెనుక భాగాన ముఖ్యమంత్రి చంద్రబాబు స్టిక్కర్‌ కూడా అతికించుకోవడం గమనార్హం.

సుక వివాదం డ్రామాలో కలెక్టర్‌ ప్రభాకరరెడ్డిని ఇరికిద్దామని మాఫియా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. జిల్లాలో చాలా వరకు ఇసుక తరలింపు వెనుక అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల పాత్ర ఉందన్నది తెలిసిందే. కొద్ది రోజు లుగా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు దాడి చేయడం.. పెద్దఎత్తున జరిమానాలు విధించడంతో వారంతా గుర్రు మీద ఉన్నారు. దాడుల వెనుక కలెక్టర్‌ పాత్ర ఉందన్న అనుమానంతో తప్పుడు ప్రచారం, ఫిర్యాదులకు తెగించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌కు వచ్చి ఇసుక విషయంలో గగ్గోలు పెట్టిన వారంతా టీడీపీ వారే కావడం గమనార్హం. సమస్య లకు వారే కారణం అవుతూ.. తిరిగి వారే ఫిర్యాదు లు ఇవ్వడం విశేషం. తాము ఇసుక వ్యాపారాన్ని నమ్ముకుని ట్రాక్టర్లు కొనుక్కున్న నిరుపేదలమని.. ఇలా దాడులు చేసి వాహనాలు తీసుకుపోతే ఎలా అని సీతానగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఆయన వద్ద 20 వరకూ ట్రాక్టర్లు ఇసుక వ్యాపారం మీద ఆధారపడి నడుస్తున్నాయని సమాచారం. ఇలా తరలిస్తున్న బళ్లలో ట్రాక్టరుకు రూ.350 చొప్పు న ఓ ఎమ్మెల్యేకు ముడుపులు ఇస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఒకటవ శ్రేణి నుంచి మూడవ శ్రేణి నదులలో పరిసర ప్రాంత అవసరాలకు ఇసుకను ట్రాక్ట ర్లు లేదా ఎడ్లబండ్ల ద్వారా తీసుకువచ్చన్న నిబంధనలు ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. దొరికినంత తవ్వేసి, దండిగా వ్యాపారం చేసుకుంటున్నారు. సీతానగరం మండలం లక్ష్మీపురం, బూర్జ, బలిజిపేట మండలంలోని వంతరాం, నారాయణపురం నదీ ప్రవాహ ప్రాంతాలు తవ్వకాలకు ఆమోదయోగ్యంగా లేవు. ప్రమాదకర స్థితిలో ఉన్నా.. ఇసుక అక్రమార్కులు వదలడం లేదు. ఈ క్రమంలోనే కొన్ని ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధించారు. అవి టీడీపీకి చెందినవి కావడంతో వివాదం రేగింది.

మా వాటా ఇస్తేనే రీచ్‌లు...

కొమరాడ మండలంలో ఇసుక రీచ్‌లపై పెద్ద దుమారమే రేగుతోంది. వాస్తవానికి ఇక్కడ రీచ్‌ కోసం ఒక మంత్రి ఆశీస్సులున్న ఓ ఏజెన్సీ రూ.40 లక్షల వరకూ ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇందుకోసం ఎవరి స్థాయిలో వారికి ముడుపులు కూడా అందించినట్లు తెలిసింది. తొలుత ముడుపులకు అంగీకరించిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. తర్వాత అమ్మకాల్లో వాటాలు డిమాండ్‌ చేసినట్లు భోగట్టా. అందుకు సదరు ఏజెన్సీ చేతులెత్తేయడంతో తమ భూములు ఉన్నాయని ఓ వర్గాన్ని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. పదేళ్లుగా ఆ భూమి వైపు వెళ్లలేదని సదరు వ్యక్తులు స్వయంగా కలెక్టర్‌, మంత్రి ఎదుటే అంగీకరించారు. వీరి మీద విచారణ చేయాలని మంత్రి సూచించారు.

●ఇటీవల కాలంలో కురుపాం, పార్వతీపురం నియోజక వర్గాల్లో భారీగా ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కురుపాంలోని ఓ పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున అనధికారికంగా పోగు చేసిన ఇసుక నిల్వలను రెండు రోజుల కిందట గుర్తించారు. ఇవన్నీ టీడీపీ వారి కనుసన్నల్లో తరలిస్తున్నవే. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక మేట వేసిన చోటే, తవ్వుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇక్కడ మాత్రం నిబంధనలను కాలారసి, తవ్వేస్తున్నారు. సొంత అవసరాలకు అని అధికారులను ఏమార్చి పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకుంటున్నారు. అడ్డు వచ్చిన అధికారుల మీద తప్పుడు ఫిర్యాదులతో దాడి చేయిస్తున్నారు.

రెండు రోజుల్లో కలెక్టర్‌ వెళ్లిపోరా!

‘కలెక్టర్‌ ఎన్ని రోజులుంటారు.. ఓ రెండు రోజులు. వెళ్లిపోవడం పక్కా. లేదంటే నెల, పోనీ, ఆరు నెలలో, ఏడాదో! అంతకుమించి ఉండరు. ఇసుకను తరలిస్తే, అడ్డుకునేదానికి ఆయనెవరు? ట్రాక్టర్లు కొనుక్కొని మూలన దాచుకుంటామా? ఇసుక ఉచితమే కదా! నా మీద ఆయన సీరియస్‌ అవ్వాల్సిన అవసరం ఏమిటి? నేను ఎమ్మెల్యే మనిషినే. అయితే.. ఏంటంట?.. ఆయన ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్లు ఉంది!’

●‘ఇసుక తరలిస్తున్నామని ప్రతిసారీ అధికారులు పట్టుకుంటామంటే ఎలా కుదురుతాది? ఎవరితో ఫోన్‌ చేయించాలి? చంద్రబాబుతో ఫోన్‌ చేయించాలా.. చెప్పండి!’

●తమ ట్రాక్టర్లు పట్టుకున్నారని సీతానగరానికి చెందిన ఓ ఇసుక మాఫియా బహిరంగంగానే విసరుతున్న సవాళ్లు ఇవీ.. సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు వచ్చి మంత్రి సంధ్యారాణికి వినతిపత్రం అందించారు. అక్కడ అనుమతులు లేనివి అక్రమంగా ఎలా తరలిస్తారు.. మీకు ఎవరైనా తవ్వుకోమని చెప్పారా?’ అని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి ప్రశ్నించడంతో.. అనంతరం బయటకు వచ్చిన ఇసుక మాఫియా మైనింగ్‌ అధికారుల వద్దే బెదిరింపులకు దిగారు. ఈ నెల పదో తేదీలోగా కలెక్టర్‌ను బదిలీ చేయిస్తానని ఓ ప్రజా ప్రతినిధి భరోసా ఇవ్వడంతోనే వారు ఈ విధంగా రెచ్చిపోతున్నారని వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement