ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
● మోసం చేయడం చంద్రబాబు నైజం ● వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజం ● కూటమి పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఫొటో ఎగ్జిబిషన్ ● స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి ● ఉమ్మడి విజయనగరం జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పరీక్షిత్‌రాజు
సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు
పార్వతీపురం:
చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తూ, అక్రమ కేసులతో ప్రజల ను భయబ్రాంతులకు గురిచేస్తోందని విజయనగ రం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తా రు. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత గడిచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతి, కార్యకర్తలు, నాయకులపై జరిగి న దాడులపై నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నా వెరవకుండా, ప్రజల తరఫున పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్తుండడం అభినందనీయమన్నారు. రానున్నది మన ప్రభుత్వమేనని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు 2.0లో తగిన గుర్తింపు, సముచిత స్థానం కల్పిస్తామని జగన్‌మోహన్ రెడ్డి స్పష్టంచేశారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లో చంద్రబాబు ప్రభుత్వం సుమారు రూ.4లక్షల కోట్లు అప్పుచేసి అనుయాయులకు దోచిపెడుతోందన్నారు. ఆ భారాన్ని ప్రజలపై మోపి మరింత ఆర్థిక సంక్షోభానికి గురిచేస్తోందని తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు చెబుతున్నా సీఎం చంద్రబాబు స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సర్ కార్యక్రమంపై కార్యకర్తలు, నాయకులు, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్ల చేర్పులు, తొలగింపులపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుబి మోగించేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్వతీపురం మండలం, మున్సిపాల్టీ, సీతానగరం, బలిజిపేట మండలాల నుంచి వందలాదిమంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్లు యిండుపూరు గున్నేశ్వరరావు, కొండపల్లి రుక్మిణి, ఎంపీపీ మజ్జి శోభారాణి, వైస్ ఎంపీపీలు సిద్దా జగన్నాథం, బి.రవికుమార్, బలిజిపేట, సీతానగరం జెడ్పీటీసీలు అలజంగి రవికుమార్, మామిడి బాబ్జి, పార్వతీపురం, బలిజిపేట మండలాల అధ్యక్షులు బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, అనుబంధ పార్టీ సభ్యులు పోల సత్యనారాయణ, కొండలల్లి బాలకృష్ణ, బలగ శ్రీరాములనాయుడు, నాగమణి పాల్గొన్నారు.
గత రెండేళ్ల పాలనలో ప్రజలు అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతీ ఇంటికి వెళ్లి వివరిద్దాం. రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడం లేదు. మహిళలకు ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగులకు జాబ్‌క్యాలెండర్ లేదు. నిరుద్యోగ భృతి అందించడం లేదు. గ్రామాల్లో టీడీపీ నాయకులు దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఉపాధిహామీ పథకం వేతనదారుల నుంచి వారానికి రూ.230 చొప్పున వసూలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారు.
– అలజంగి జోగారావు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే
నమ్మించడం, ఓట్లు దండుకోవడం, మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైన విద్య. మాజీ సీఎం వైఎస్ జగన్‌మో హన్‌రెడ్డి కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేసి ప్రజలకు అండగా నిలిచారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారు.
– బోను గౌరీశ్వరి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్
కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చి న హామీలు అమలు చేయ కుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అన్నివర్గాల వారిని మోసంచేశారు. సమస్యలు పరిష్కరించకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా జనంతో కలిసి పోరాడదాం. ప్రజలకు అండగా నిలబడదాం.
– బలగ రేవతమ్మ,
జెడ్పీటీసీ, పార్వతీపురం


