కొత్తవలస: తీసుకున్న సీ్త్రనిధి రుణాలను నిబంధనల ప్రకారం 22నెలల 15 రోజుల్లో చెల్లించాం.. కానీ మరో నెలన్నర డబ్బులను (24 నెలలు కట్టించుకున్నారు) అదనంగా వసూలు చేశారు.. ఆ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలి.. తక్షణమే తిరిగి చెల్లించాలంటూ కొత్తవలస మండలం పాతసుంకరపాలెంకు చెందిన పొదుపు సంఘాల మహిళలు సోమవారం ఆందోళన చేశారు. గ్రామానికి వెళ్లిన ఏపీఎం ఎ.వెంకటరమణతో పాటు నలుగురు సీసీలు, సీ్త్రనిధి మేనేజర్ పి.ధనలక్ష్మిని నిలదీశారు. ఏళ్లతరబడి అదనంగా వసూలు చేసిన డబ్బులను ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలంటూ చుట్టుముట్టారు. 2018 నుంచి సుమారుగా రూ.2 కోట్ల వరకు సీ్త్రనిధి రుణాలు తీసుకుంటూ సకాలంలో వాయిదాల ప్రకారం చెల్లిస్తున్నామన్నారు. ఒక్కో గ్రూపు నుంచి నెలన్నర వాయిదా చొప్పున అదనంగా డబ్బులు వసూలు చేసి రూ.లక్షల్లో కాజేశారంటూ పొదుపు సంఘాల సభ్యులు ధనలక్ష్మి, లెంక కనకేశ్వరి, బెహరా శ్రీదేవి తదితరులు ఆరోపించారు. వెలుగు అధికారులు, బుక్ కీపర్‌ను ప్రశ్నించినా సమాధానం లేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు.
ఆందోళనకు దిగిన పాతసుంకరపాలెం మహిళలు
ఏళ్లతరబడి అదనపు వసూళ్లపై
ఆందోళన
నెలన్నర చొప్పున డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్


