అర్జీల పరిష్కారంలో మతలబు? | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో మతలబు?

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

విజయనగరం అర్బన్‌:

జిల్లా నలుమూలల నుంచి ఆశతో తరలివచ్చే పేద ప్రజల సమస్యలు తీర్చే ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ’రెవెన్యూ క్లినిక్‌’లో అర్జీలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఎండను సైతం లెక్కచేయకుండా, వందల రూపాయలు ఆటో చార్జీలు భరించి, చేతిలో అర్జీలతో క్యూలో నిలబడ్డ బాధితుల ఆవేదన చూస్తే.. క్షేత్రస్థాయిలో పాలన ఎంతగా ’స్తంభించిందో’ అర్థమవుతోంది. తాజా వినతుల వెల్లువను పరిశీలిస్తే ప్రభుత్వ శాఖల పనితీరు, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ ఎంతగా నిర్వీర్యమైందో స్పష్టంగా తెలుస్తోంది.

శాఖల వారీగా ’సమస్యల’ కుప్ప ఇదే!

సోమవారం ఒక్కరోజే పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లలో కలిపి మొత్తం 229 వినతులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 110 వినతులు కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. భూ సమస్యలు, సర్వే వివాదాల చుట్టూ పేదలు ఏళ్ల తరబడి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. వివిధ శాఖల్లో వచ్చిన వినతుల వివరాలు ఇలా ఉన్నాయి: రెవెన్యూశాఖకు 110, డీఆర్‌డీఏ 31, పంచాయతీ రాజ్‌ 16, విద్యాశాఖ 13, మున్సిపల్‌ శాఖ 11, విద్యుత్‌ శాఖ 10, గ్రామ సచివాలయ శాఖ 10, జిల్లా వైద్యారోగ్య శాఖ 6, గృహ నిర్మాణ శాఖ 3, డీసీహెచ్‌ఎస్‌ 2, ఇతర శాఖలకు 17 వచ్చాయి.

ఆన్‌లైన్‌లో ’డిస్పోజ్‌’.. క్షేత్రస్థాయిలో సున్నా..

పెండింగ్‌ వినతులను పరిష్కరించిన వెంటనే ఆన్‌న్‌లైన్‌లో ’డిస్పోజ్‌’ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సీహెచ్‌. సత్తిబాబు అధికారులను ఆదేశించాల్సి రావడం చూస్తే.. వెబ్‌సైట్లలో గణాంకాలను చూపించడానికి అధికారులు ఎంత తహతహలాడుతున్నారో అర్థమవుతోంది. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోయినా, కేవలం ఆన్‌లైన్‌లో ’క్లోజ్‌’ చేస్తున్నారనే విమర్శలు అర్జీదా రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ చూసుకోవడమే తప్ప, బాధితుడి ఇంటికెళ్లి సమస్యను రూపుమాపే నాథుడే కరువయ్యాడు.

అర్జీదారును కలవకుండానే ఎండార్స్‌మెంట్లు

‘ఆర్జీదారులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన తర్వాతే ఎండార్స్‌మెంట్‌ (ముగింపు నివేదిక) ఇవ్వాలి. మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో రాయాలి‘ అంటూ డీఆర్వో ఆదేశాలు జారీ చేయడం ద్వారా, ఇప్పటివరకు అధికారులు అర్జీదారులను కలవకుండానే, ఆఫీసుల్లో కూర్చుని తప్పుడు నివేదికలతో ఫైళ్లను మూసేస్తున్నారనే చేదు నిజం బట్టబయలైంది.

1100 టోల్‌ ఫ్రీ.. ఒరిగింది శూన్యం!

ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ’1100 టోల్‌ ఫ్రీ’ నంబర్‌ ద్వారా అందిన కాల్స్‌ పట్ల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో డీఆర్వో క్లాస్‌ పీకిన తీరే చెబుతోంది. టోల్‌ ఫ్రీ నంబర్‌ పై ప్రజల్లో అవగాహన లేకపోగా, వచ్చిన కాల్స్‌కు కూడా అధికారులు బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇస్తూ కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో పీజీఆర్‌ఎస్‌ జిల్లా నోడల్‌ అధికారి ఇ.మురళి, జిల్లా స్పెషల్‌ డిప్యూటి కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వరరావు, కళావతి, అరుణ కుమారి, శాంతి, ఆర్‌డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 36ఫిర్యాదులు

విజయనగరం క్రైమ్‌: ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ దామోదర్‌ అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకార్యక్రమంలోఫిర్యాదు దారులనుంచి ఎస్పీ 36 ఫిర్యాదులు స్వీకరించారు.ప్రజల సమస్యలను ఎస్పీ శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో ఫిర్యాదు దారుల ముందే మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, వారికి న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఏఆర్‌దామోదర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్మీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.

గుట్టలుగా అర్జీలు..కానరాని పరిష్కారం

క్షేత్రస్థాయిలో అంతులేని అలసత్వం

కాగితాలకే పరిమితమవుతున్న

’డిస్పోజల్స్‌’

ఒక్క రోజే 229 వినతులు

Advertisement
 
Advertisement
Advertisement