అర్జీదారులకు రాతపూర్వక సమాధానం తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

అర్జీదారులకు రాతపూర్వక సమాధానం తప్పనిసరి

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

అధికారులకు మంత్రి గుమ్మడి

సంధ్యారాణి ఆదేశం

పార్వతీపురం రూరల్‌: జిల్లా ప్రజల నుంచి వచ్చే సమస్యలకు ఇక్కడే పరిష్కారం చూపాలని, ఆయా దరఖాస్తులు ముఖ్యమంత్రి వరకు వెళ్లే పరిస్థితి తీసుకురాకూడదని రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలోని కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డితో కలిసి ఆమె ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో, ప్రతి శుక్రవారం నియోజకవర్గాల పరిధిలో గ్రీవెన్స్‌ సెల్‌ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఒకే నియోజకవర్గ కేంద్రంలో నెలలో నాలుగుసార్లు గ్రీవెనన్స్‌ సెల్‌ నిర్వహించడం ద్వారా రెవెన్యూ తదితర సమస్యల కోసం బాధితులు పదేపదే తిరిగే అవసరం లేకుండా అక్కడికక్కడే పరిష్కారమవుతాయన్నారు. గ్రీవెన్స్‌ సెల్‌కు వచ్చే ప్రజల పట్ల అధికారులు ఓపికగా వ్యవహరించాలని, ఏదైనా సమస్య పరిష్కారం సాధ్యపడకపోతే అందుకు గల కారణాలను వివరిస్తూ అర్జీదారునికి సంబంధిత మండల కార్యాలయం నుంచి రాతపూర్వకంగా లేఖ పంపాలని ఆమె స్పష్టం చేశారు.

వెల్లువెత్తిన దరఖాస్తులు

ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి మొత్తం 75 అర్జీలు రాగా, వాటిలో 45 సాధారణ, 30 రెవెన్యూ వినతులు ఉన్నాయి. కార్యక్రమంలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఉప కలెక్టర్‌ ధర్మరాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌

పార్వతీపురం రూరల్‌: జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌ ద్వారా మాట్లా డి, నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించి కార్యాలయానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కుటుంబ కలహాలు, సైబర్‌ మోసాలు, ఆస్తి వివాదాలు, వేధింపులు, ఆన్‌న్‌లైన్‌ వంచన తదితర అంశాలపై మొత్తం 12 ఫిర్యాదులు అందాయి. ప్రజలు ఎటువంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ బి.రమణమూర్తి, డీసీఆర్‌బీ ఎస్సై అశోక్‌ చక్రవర్తి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో 21 వినతుల స్వీకరణ

సీతంపేట: ఐటీడీఏలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని ఐటీడీఏ పరిపాలనాధికారి వి.సునీల్‌ నిర్వహించి గిరిజన ప్రజల నుంచి 21 వినతులు స్వీకరించారు. మల్లమ్మకొండ గ్రామానికి చెందిన సవర బంబడు తమ గ్రామానికి కరెంటు స్తంభాలు మంజూరు చేయాలని ప్రతిపత్రం సమర్పించాడు. టెక్కలి మండలం కోదండపురం గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు గ్రామానికి రోడ్డు, బ్రిడ్జి సదుపాయం కల్పించాలని అర్జీ అందజేశాడు. సారవకోట మండలం సవర శివరాంపురం గ్రామానికి చెందిన అప్పారావు ఆయిల్‌ ఇంజిన్‌ మంజూరు చేయాలని, సవరబంగి గూడ గ్రామానికి చెందిన సవర మంగులు టీవీఎస్‌ బైక్‌ ఇప్పించాలని కోరారు. సిరికొండ గ్రామానికి చెందిన కొండగొర్రె సోమయ్య మినీ ట్రాక్టర్‌ మంజూరు చేయాలని, గదబవలస గ్రామానికి చెందిన బాలరాజు తన సస్పెన్షన్‌ను రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. అక్కన్నగూడ గ్రామానికి చెందిన సవర బంబడమ్మ సీసీ రోడ్డు మంజూరు చేయాలని, అంబలగండి గ్రామానికి చెందిన కుష్టయ్య కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలని వినతిపత్రాలు అందజేశారు. గుజ్జి గ్రామానికి చెందిన భాస్కరరావు పవర టిల్లర్‌ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించాడు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ఎ.డి శ్రీనివాసరావు, డీడీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ అప్పారావు, వెలుగు డీపీఎం రమణ, డిప్యూటీ డీఈఓ నారాయుడు,స్పోర్ట్స్‌ ఇన్‌చార్జ్‌ జాకాబ్‌ దయానందం, జీసీడీఓ రాములమ్మ, ఏవో వాహిని ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement