● హాజరైన హోం మంత్రి వంగల పూడి అనిత
వేపాడ: భూములపై శాశ్వతమైన హక్కులు ప్రజలకు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ మేరకు సోమవారం వేపాడ మండలంలోని బల్లంకి గ్రామంలో తహసీల్దార్ జె.రాములమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఆర్‌డీఓ సుధాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి అనిత మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించేందుకు రీసర్వే నిర్వహించి రాజముద్ర తో పూర్తివివరాలతో చట్టబద్ధమైన భరోసా కల్పించేలా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 983 గ్రామాలకు గాను 519 గ్రామాల్లో రీ సర్వే పూర్తి అయ్యిందని మరో 464 గ్రామాల్లో చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీసీసీబీ చైర్మన్ గొంప కృష్ణ, తహసీల్దార్ రాములమ్మ, ఎంపీడీఓ సూర్యనారాయణ మండల ప్రత్యేకాధికారి లక్ష్మీనారాయణ, ఎస్‌కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, ఎస్సై సుదర్శన్, ఎంపీటీసీ గొంప తులసి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకుడి మనస్తాపం
బల్లంకిలో నిర్వహించిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ వేపాడ మండల అధ్యక్షుడు లట్టాల పవన్ కుమార్‌ను స్టేజిపైకి ఆహ్వానించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర మండలాల నుంచి వచ్చిన టీడీపీ మండల అద్యక్షులు, జనసేన నాయకులను ఆహ్వానించి అధికారులు బీజేపీని విస్మరించడం బాధాకరమని పవన్ అన్నారు. ఈ విషయాన్ని జిల్లా, నియోజకవర్గ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు పవన్ తెలిపారు.


