సోమవారం శ్రీ 8 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 8 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 8 2026 7:00 AM | Updated on Jun 8 2026 7:00 AM

చమురు సెగలు..

ప్రజల బడ్జెట్‌ తారుమారు

న్యూస్‌రీల్‌

సాక్షి, పార్వతీపురం మన్యం: చమురు సంస్థలు మరోసారి షాక్‌ ఇచ్చాయి. ఈ సారి మహిళల వంటింటిపై బాంబు పేల్చాయి. గృహవసరాల గ్యాస్‌ సిలిండర్ల ధరను ఆదివారం రూ.29 చొప్పున పెంచాయి. చివరిగా గత మార్చి నెలలో రూ.60 చొప్పున వడ్డించిన విషయం విదితమే. మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి ధరలు పెంచడంపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 16 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. తాజాగా పెరిగిన ధరలతో 14.2 కిలోల డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ రూ.969.50 అయ్యింది. జిల్లాలో సాధారణ, సీఎస్‌ఆర్‌, పీఎంయూవై, దీపం, ట్రైబుల్‌ కలిపి మొత్తం 3.16 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సగటున నెలకు 1.50 లక్షల సిలిండర్లు వినియోగం అవుతాయని అంచనా. దీనివల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజల వంటింటి ఖర్చుపై అదనపు భారం పడనుంది.

రాయితీకీ మంగళం

ఓ వైపు గతంలో రూ.వందల్లో ఉండే రాయితీ అమాంతం తగ్గిపోయింది. ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న రాయితీ రూ.3 చొప్పునే తిరిగి బ్యాంకు ఖాతాలో జమవుతోంది. దీనివల్ల వినియోగదారులు పూర్తి మొత్తమిచ్చే సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది కాక.. ఇంటికి తీసుకొచ్చి బండ ఇచ్చినందుకు డెలివరీ బాయ్స్‌కు అదనంగా రూ.50 ఇవ్వాల్సి వస్తోంది. సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా సగం మందికి అందని పరిస్థితి. గతంలో గ్యాస్‌ ధరలు పెరిగినప్పుడు, వినియోగదారులపై ఆ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ మొత్తం భరించేవి. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేకపోయింది.

ధరలతో దడదడ

ఓ వైపు పెట్రో ధరలు, మరోవైపు గ్యాస్‌ ధరలు కొద్ది రోజులుగా పెరుగుతూ పోతుండడంతో సామాన్యు లు విలవిలలాడుతున్నారు. మోయలేని భారాలతో సతమతమవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు పెరిగిన ధరలను భరించలేకపోతున్నారు. చేసేది లేక మోయలేని భారాలు మోస్తున్నామని పలువురు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో సామాన్యుని జీవనం అతలాకుతలమవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఈ ధరలు ఇలా పెరుగుతూ పోతే భవిష్యత్‌లో మరిన్ని కష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మొదలు.. ఆ సాకును చూపుతూ చమురు సంస్థలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. మూడు నెలల వ్యవధిలోనే డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ల ధరలు రెండు సార్లు.. నెల రోజుల వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నాలుగు సార్లు పెంచాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధర రూ.118, డీజిల్‌ రూ.105 వరకు ఉంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్‌ ధర గత ఫిబ్రవరిలో రూ.1,824 ఉండగా... విడతల వారీగా పెంచుతూ ప్రస్తుతం రూ.3,228 అయ్యింది. వాణిజ్య సిలిండర్లపై ఎటువంటి రాయితీ ఉండదు. ఈ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఉత్పత్తుల సంస్థలపై పడుతోంది. ఈ మూడు, నాలుగు నెలల కాలంలోనే ఆహార పదార్థాల ధరలను హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు పెంచేశాయి. గ్యాస్‌ కొరత బూచిగా చూపుతూ, పెద్ద రెస్టారెంట్లు బిల్లుతో పాటు, గ్యాస్‌ చార్జీలు అంటూ అదనపు మొత్తం వడ్డిస్తున్నాయి. మొత్తంగా ఈ భారం కూడా ప్రజల మీదే పడుతోంది. ఇలా పెరుగుతున్న చమురు ధరల కారణంగా తమ నెలవారీ బడ్జెట్‌ తలకిందులు అయ్యిందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాపోతున్నారు.

గ్యాస్‌ సిలిండర్‌ ధర మళ్లీ పెంపు

రూ.29లు పెంపు

వంటింటిపై మరింత భారం

సామాన్యుల నడ్డి విరుస్తున్న ధరల పెంపు

గ్యాస్‌, పెట్రోల్‌ ధరల పెంపుతో విలవిల

Advertisement
 
Advertisement
Advertisement